Skip to main content

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. కృష్ణాపురం గోశాలలో ‘సీత’ ప్రత్యేక శిక్షణకు శ్రీకారం దేవాలయ గోశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఈవో జల్లేపల్లి వెంకట్రావు.

 

                  K.V.SHARMA EDITOR 
సింహాచలం, జూలై 7: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలోని కృష్ణాపురం గోశాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ శిక్షణా సంస్థ సీత (State Institute of Temple Administration) ఆధ్వర్యంలో మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.


శిక్షణ కార్యక్రమాన్ని సీత డైరెక్టర్ శ్రీ ముక్తేశ్వరరావు, ఐఏఎస్, అసిస్టెంట్ డైరెక్టర్ విష్ణు ప్రసాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం గోశాలల శాస్త్రీయ నిర్వహణ, పశువుల ఆరోగ్య సంరక్షణ, సమతుల్య మేత తయారీ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, పరిశుభ్రత ప్రమాణాలు, గోసంరక్షణలో అనుసరించాల్సిన ఆధునిక విధానాలపై నిపుణులు శిక్షణ అందించారు.



ఈ సందర్భంగా సీత డైరెక్టర్ ముక్తేశ్వరరావు, ఐఏఎస్ మాట్లాడుతూ, గోవు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని, దేవాలయాల ఆధ్వర్యంలోని గోశాలలు కేవలం పశువుల సంరక్షణ కేంద్రాలుగా కాకుండా గోసేవ, గోసంరక్షణ, సాంప్రదాయ విలువల పరిరక్షణకు కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు. గోశాలల నిర్వహణలో శాస్త్రీయ విధానాలతో పాటు సేవాభావం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు గోశాల సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ గోశాలల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.




ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని దేవాలయ గోశాలలను ఆదర్శ గోశాలలుగా తీర్చిదిద్దడం, గోసంరక్షణను మరింత శాస్త్రీయంగా నిర్వహించడం, గోశాల సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.


జూలై 7 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ఈ శిక్షణలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వివిధ దేవాలయాల గోశాలల సూపర్వైజర్లు, సూపరింటెండెంట్లు, క్లర్కులు, కృష్ణాపురం గోశాల సిబ్బంది పాల్గొంటున్నారు.

శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం తరఫున ఇన్‌చార్జి పర్యవేక్షణాధికారి మూలా వాసు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.


ఈ కార్యక్రమంలో సీత డైరెక్టర్ ముక్తేశ్వరరావు, ఐఏఎస్, అసిస్టెంట్ డైరెక్టర్ విష్ణు ప్రసాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు, కనకమహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పశుసంవర్థక శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ శర్మ మరియు డా. గౌతమ్ , ఇన్‌చార్జి పర్యవేక్షణాధికారి మూలా వాసు, సీత సీనియర్ నాయకులు లక్ష్మణస్వామి గోశాల సిబ్బంది, వివిధ దేవాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు

Comments