Skip to main content

ఏయూలో ఘనంగా అల్లూరి జ‌యంతి నిర్వ‌హ‌ణ‌ అల్లూరి స్ఫూర్తితో ఆదీవాసీ అభ్యున్న‌త్త‌కి కృషి చేయాలి ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్

                K.V.SHARMA EDITOR 


విశాఖపట్నం విశాఖసందేశంవార్తలు ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 4: స్వాతంత్య్ర స‌మర యోధుడు అల్లూరి సీతారామ‌రాజు స్ఫూర్తితో ఆదివాసీల అభ్యున్న‌తికి కృషి చేయాలనీ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ అన్నారు. శ‌నివారం అల్లూరి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఏయూ న్యాయ క‌ళాశాల వ‌ద్ద‌నున్న అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఉప‌కుల‌ప‌తి నివాళులు అర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ ఏయూలోని మ‌హిళా అధ్య‌య‌న కేంద్రం, సెంట‌ర్ ఫ‌ర్ ఇంక్లూజివ్ స్ట‌డీస్‌, ఆంత్ర‌పాల‌జీ, భాష శాస్త్ర విభాగాలు ఆదివాసీల అభ్యున్న‌తికి ఉప‌యుక్తంగా ప‌లు ప‌రిశోధ‌న ప్రాజెక్టుల‌ను నిర్వ‌హించాల‌న్నారు. ఈ దిశ‌గా అల్లూరి జిల్లా యంత్రాంగంతో చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. పూర్త‌స్థాయిలో నివేదిక సిద్దం చేసుకుని ఆదివాసీల విద్య‌, ఆరోగ్యం, వికాసానికి ఉప‌యుక్తంగా ప‌నిచేస్తామ‌న్నారు.


స్వాతంత్య్ర స‌ముపార్జ‌న‌తో పాటు, ఆదివాసీల అభ్యున్న‌తికి అల్లూరి చేసిన కృషిని గుర్తుచేసుకోవాల‌న్నారు. ఆయ‌న చూపిన స్ఫూర్తిని కొన‌సాగిస్తూ వారి అభ్యున్న‌తికి స‌మిష్టిగా క‌ల‌సి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గిరిజ‌న ప్రాంతాల‌లో పాఠ‌శాల‌కు మ‌ధ్య‌లో మానివేసేవారు(డ్రాపౌట్స్‌) సంఖ్య‌ను త‌గ్గించ‌డం, చిన్న వ‌య‌సులో గ‌ర్భం దాల్చ‌డం ద్వారా ఎదుర‌వుతున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను వారికి తెలియ‌జేయ‌డం ఎంతో ప్ర‌ధాన‌మ‌న్నారు. వారి ఆరోగ్యం, జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌ర‌చే విధంగా విశ్వ‌విద్యాల‌య ప‌రంగా అవ‌స‌ర‌మైన మేధో స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. నైపుణ్య శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను సైతం నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు సూచించారు.


కార్య‌క్ర‌మంలో భాగంగా తెలుగు విభాగం పూర్వ విద్యార్థి పి.శ్రీ‌నివాస రావు ర‌చించిన అల్లూరి జీవిత చ‌రిత్ర పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో రిజిస్ట్రార్` ఆచార్య కె.రాంబాబు, అల్లూరి అధ్య‌య‌న కేంద్రం సంచాల‌కులు ఆచార్య కె.ర‌మేష్ బాబు, ప్రిన్సిపాల్స్‌, డీన్‌లు, అధికారులు, ఆచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments