విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తలు:విద్యార్థినుల భద్రత, సామాజిక బాధ్యత మరియు చట్టాల పట్ల అవగాహన పెంపొందించే ఉద్దేశ్యంతో దొంగతనాల నివారణ మరియు మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుర్వినియోగం అంశాలపై సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల లో నేడు కంచరపాలెం పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ .D.రమణమూర్తి గారి చే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంచరపాలెం పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ .D.రమణమూర్తి గారు విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో పెరుగుతున్న దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లు, నగదు వంటి వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థినులకు సూచించారు.
అలాగే, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలను ఆయన వివరించారు. స్నేహితుల ఒత్తిడికి లేదా తప్పుడు ఆకర్షణలకు లోనుకాకుండా, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుందని, వాటి అక్రమ రవాణా, వినియోగం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని తెలియజేశారు.
విద్యార్థినులు చట్టాలను గౌరవిస్తూ, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని, ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని శ్రీ రమణమూర్తి గారు పిలుపునిచ్చారు.
ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో EAGLE Club సమన్వయకర్త మరియు NSS కార్యక్రమ అధికారి డా. ఈ. హారిణి గారు కీలక పాత్ర పోషించారు. విద్యార్థినుల్లో సామాజిక చైతన్యం, చట్టాల పట్ల గౌరవం మరియు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో దోహదపడతాయని ఆమె తెలిపారు.



Comments
Post a Comment