పంచధార్ల వారసత్వ సంపదను కాపాడాలి* *– కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ మద్దిల గురుమూర్తి*
న్యూఢిల్లీ, జూలై 23: విశాఖపట్నం జిల్లా పంచధార్లలోని వారసత్వ సంపదను కాపాడాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో మంత్రిని కలిసి పూర్తి వివరాలను అందజేశారు. ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసి, మొత్తం పంచధార్ల కొండ ప్రాంతాన్ని “మైనింగ్ రహిత వారసత్వ క్షేత్రం”గా ప్రకటించాలని విన్నవించారు.
ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు స్థలం శాతవాహన కాలానికి చెందిన అత్యంత ప్రాచీన వారసత్వ కట్టడం అని, ఇది భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) రక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిందని ఎంపీ పేర్కొన్నారు. అలాగే పంచధార్లలోని శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయమని తెలిపారు. ఈ రెండు వారసత్వ కట్టడాల సమీపంలో మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలు కొనసాగడం వల్ల పురావస్తు సంపదకు, సహజ వాతావరణానికి, శాశ్వత జలధారలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ క్షేత్రానికి సుమారు 90 మీటర్లు, 190 మీటర్లు, 200 మీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోందని ఉపగ్రహ చిత్రాలు, క్షేత్రస్థాయి పరిశీలనలు సూచిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి పురావస్తు సంరక్షణ చట్టాల ఉల్లంఘన అయ్యే అవకాశముందని తెలిపారు.
ఈ నేపథ్యంలో పురావస్తు శాఖతో తక్షణ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని, మైనింగ్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. అలాగే పంచధార్ల మొత్తం వారసత్వ ప్రాంతాన్ని “మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్”గా ప్రకటించి భావితరాల కోసం ఈ అమూల్యమైన సాంస్కృతిక సంపదను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Comments
Post a Comment