Skip to main content

మహిళను వివస్త్రను చేసి కొట్టడం సిగ్గుచేటు గుంటూరు సిటీ ఘటన అత్యంత హేయం :ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌ విశాఖలోని వైయస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి పాలనలో వరుసగా దారుణాలు సభ్య సమాజం తలదించుకునే ఘటనలు హోంమంత్రి అనిత తక్షణం రాజీనామా చేయాలి సీఎం చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలి : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్‌ మహిళలపై దాడి ఘటనల్లో నిందితులు కూటమి నాయకులే చూసీచూడనట్టు వదిలేయబట్టే వారు మరింతగా రెచ్చిపోతున్నారు నాయకులను చూసి కార్యకర్తలు ఇంకా పేట్రేగి అరాచకాలు చేస్తున్నారు మహిళలను నడి రోడ్డుపై వివస్త్రలను చేసే ఘటనలు దేనికి సంకేతం? ఇలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి సిగ్గు పడాలి :ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన వరుదు కళ్యాణి


 విశాఖపట్నం: గుంటూరు నగరంలో టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని, సీఎం చంద్రబాబు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలోని వైయస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 15వ తేదీ దారుణం జరిగితే బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని, సాక్షి మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియబట్టే సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందించారని గుర్తు చేశారు.

ఈ మూడు రోజులు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్‌ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళలుగా హోంమంత్రి, ఎమ్మెల్యే, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మొన్ననే కావలిలో గిరిజన మహిళలను టీడీపీ కౌన్సిలర్‌ వివస్త్రను చేసి వేధించిన ఘటన మరువకముందే ఇలాంటిదే మరో ఘటన గుంటూరు నగరంలో జరగడం ప్రభుత్వ పనితనానికి అద్దం పడుతోందన్నారు.

రాష్ట్రంలో మహిళలపై ఏ దారుణం జరిగినా నిందితులు టీడీపీ నాయకులు, కార్యకర్తలే ఉంటున్నారని.. వారి తప్పులను చూసీచూడనట్టు ప్రభుత్వం వదలేయడం వల్లనే దారుణాలకు అంతులేకుండా పోతుందని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి పాలనలో మహిళలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లిపోతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి తెగించిన నిందితులతోపాటు పట్టించుకోని పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

ప్రెస్‌మీట్‌లో వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:

కాళ్లతో తన్ని వివస్త్రనను చేశారు:

గుంటూరు నగరంలో నీటి బోర్, మోటర్‌ పంప్‌ విషయంలో రూ.10 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో, టీడీపీ వార్డు సెక్రటరీ మల్లెల మూర్తి అతని కుటుంబ సభ్యులు కలిసి ఒక మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై 10 నిమిషాల పాటు అమానుషంగా దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునే సంఘటన. బాధితురాలు భయంతో మూత్రం పోసుకున్నా విడిచిపెట్టకుండా కాళ్లతో తన్ని దాడి చేశారు. మొన్న కావలిలో గిరిజన మహిళపై జరిగిన దాడి మరువకముందే ఈ ఘోరం జరిగిందంటే, కూటమి పాలనలో మహిళలకు బ్రతికే స్వేచ్ఛే లేకుండా పోయింది. ఈ దాడులకు కారణం నిందితులపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే. 15న ఈ దారుణం జరిగితే, 16న బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె అనుచరులు కేసును సెటిల్‌ చేయడానికి ప్రయత్నించడం వల్లే మూడు రోజులు జాప్యం జరిగింది. నిన్న ’సాక్షి’ మీడియా ఈ అరాచకాన్ని వెలుగులోకి తెచ్చి వీడియోలు వైరల్‌ అయ్యాక, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని గ్రహించి ఈరోజు ఉదయం చంద్రబాబు ట్వీట్‌ చేశారు, ఆ తర్వాతే పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

’తెలుగు దుశ్శాసన పార్టీగా టీడీపీ:

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా ఫెయిల్‌ అయింది. ఒక మహిళా హోం మంత్రిగా ఉండి కూడా అనిత  శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమయ్యారు. కేవలం వీడియో కాల్‌ పరామర్శలకే పరిమితమవుతున్న ఆమె నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. అటు మహిళా కమిషన్‌ కూడా అధికార పార్టీ నేతలపై సుమోటోగా కేసు నమోదు చేయకుండా నిద్రపోతోంది. రాష్ట్రంలో చట్టం, న్యాయం పక్కనపెట్టి ’రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’ నడుపుతున్నారు.

ఏపీలో టీడీపీ అంటే ’తెలుగు దుశ్శాసన పార్టీ’గా, ’తెలుగు దుర్మార్గుల పార్టీ’గా మారిపోయింది. కూటమి నేతలైన కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్, కిరణ్‌ రాయల్, నజీర్, కొలికిపూడి శ్రీనివాస్‌ వంటి ప్రజాప్రతినిధులు మహిళలపై వేధింపులకు పాల్పడినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు భయం లేకుండా పోయింది.

ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్‌ వ్యవహారం:

ఈ కూటమి పాలనలో రోజుకు 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పోలీస్‌ రెస్పాన్స్‌ టైమ్‌ దారుణంగా పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లేఖ రాసినా వీరికి సిగ్గు రాలేదు. చివరకు బీఎన్‌ఎస్‌ ఎస్‌ చట్టాల అమలు నివేదికలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి 36వ స్థానంలో నిలిచింది. పోలీసులు కేవలం రాజకీయ కక్ష సాధింపులకే పరిమితమయ్యారు. చంద్రబాబు గారు కేవలం ట్వీట్లతో, సస్పెన్షన్లతో సరిపెట్టడం కాదు; ఈ అమానుష ఘటనపై రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కేసును తొక్కిపెట్టడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే గల్లా మాధవి కాల్‌ డేటాను బయటపెట్టి, సెటిల్మెంట్‌ దారులపై కూడా చర్యలు తీసుకోవాలి. 

ఇంకా గతంలో మహిళలపై జరిగిన అన్ని అన్యాయాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం అని వరుదు కళ్యాణి హెచ్చరించారు.

Comments