మామిడికి కనీస మద్దతు ధర చట్టబద్ధ హామీ కల్పించాలి* *లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించిన వైసీపీ ఎంపీ గురుమూర్తి*
న్యూఢిల్లీ, జూలై 23: మామిడి రైతులకు కనీస మద్దతు ధరకి చట్టబద్ధ హామీ కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ తిరుపతి పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మామిడి రైతులు ఈ ఏడాది తీవ్ర నష్టాలను చవిచూశారని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఈ సీజన్‌లో సుమారు 15 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కాగా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనే రెండు లక్షల టన్నులకు పైగా మామిడి సరైన కొనుగోలు లేక వృథా అయిందని పేర్కొన్నారు.
గతంలో కిలోకు రూ.25 వరకు ధర పలికిన తోతాపూరి మామిడి ప్రస్తుతం కిలోకు కేవలం రూ.2 నుంచి రూ.7 మధ్య మాత్రమే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రాసెసింగ్ యూనిట్లు కిలోకు రూ.4 నుంచి రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు సాగు ఖర్చులు కూడా రాబట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర నిర్ణయించాలని సూచించినప్పటికీ, ప్రస్తుతం కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ లేకపోవడం వల్ల రైతులకు నష్టపోతున్నారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. 22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ, ఆ ధరకు కొనుగోలు చేయాల్సిన చట్టపరమైన హామీ లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వరి రైతులకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు కొనుగోళ్లు జరగడం, చెల్లింపుల్లో జాప్యం, వేరుశెనగ సాగు గణనీయంగా తగ్గిపోవడం, పొగాకు రైతులు తగిన మద్దతు లేని వేలం పాటలు, పెరుగుతున్న సాగు వ్యయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా సభ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర చట్టబద్ధ హామీ కల్పించే చట్టాన్ని తీసుకురావాలని, రైతులకు హామీతో కూడిన కొనుగోలు, సకాలంలో చెల్లింపులు నిర్ధారించాలని, అలాగే కొనుగోలు కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ మౌలిక వసతులను బలోపేతం చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్ ద్వారా కోరారు.

Comments
Post a Comment