పుట్టపర్తి, జూలై 12:ఈ నెల 26వ తేదీన పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించనున్న "శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ – స్పిరిట్ ఆఫ్ యూనిటీ" కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జే. రత్నాకర్ పిలుపునిచ్చారు.
ఆదివారం, (ఈ రోజు ) ప్రశాంతి నిలయంలోని సత్సంగ్ హాల్‌లో జరిగిన శ్రీ సత్యసాయి జిల్లా సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో సమాజం లో అన్ని వర్గాల నుంచి ఉత్సాహంగా ముందుకు వచ్చిన వేలాదిమందితో విజయవంతంగా నిర్వహించిన "రన్ అండ్ రైడ్ – స్పిరిట్ ఆఫ్ యూనిటీ" కార్యక్రమాల ముగింపుగా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 26న పుట్టపర్తిలో గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ ఆర్. జే. రత్నాకర్ మాట్లాడుతూ, "శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ – స్పిరిట్ ఆఫ్ యూనిటీ" కేవలం పరుగు, సైకిల్ యాత్ర మాత్రమే కాదని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఐక్యత, ఆరోగ్య అవగాహన, 'ఫిట్ ఇండియా' ఉద్యమ స్ఫూర్తి, మానవతా విలువలు మరియు విశ్వసౌభ్రాతృత్వాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పే ఒక సామూహిక ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని భగవాన్ బోధించిన "అందరినీ ప్రేమించండి – అందరికీ సేవ చేయండి", "ఒకే జాతి – మానవ జాతి" అనే శాశ్వత సందేశాన్ని సమాజంలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
సత్యసాయి జిల్లా పరిధిలోని అన్ని సమితులు, భజన మండళ్లు, యువజన సభ్యులు, సేవాదళ్ సభ్యులు భక్తులు మరియు పురజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా నుంచి సుమారు 15 వేల మంది పాల్గొనేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
శ్రీ సత్యసాయి జిల్లా సేవా కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్న శ్రీ రత్నాకర్, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా పరిధిలో నూతనంగా నియమితులైన తొమ్మిది మంది జోనల్ ఇన్‌చార్జ్‌లను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటాలను అందజేసి అభినందించారు.
అంతకుముందు జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ – స్పిరిట్ ఆఫ్ యూనిటీ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు పలు సేవా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థల జాతీయ సేవా సమన్వయకర్త శ్రీ ఎస్. కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, రాష్ట్ర యువజన విభాగ సమన్వయకర్త శ్రీ సి. గౌతమ్, రాష్ట్ర జాయింట్ సర్వీస్ కోఆర్డినేటర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి, సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొని ప్రసంగించారు.



Comments
Post a Comment