ఆధునిక బోధనా పద్ధతులు అవలంబిస్తేనే నాణ్యమైన విద్య సాధ్యం ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ప్రారంభం
ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 27:ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (IASE) ఆధ్వర్యంలో "ఆధునిక బోధన పద్దతులు" అంశంపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (FDP) సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఐఏఎస్‌ఈ సెమినార్ హాల్‌లో జరిగిన ప్రారంభ సమావేశానికి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ హాజరై అతిధులతో కలసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గౌరవ అతిథి ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ( ఇఫ్లూ) ఆచార్యులు డా. ఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ బోధనా విధానాలను అధ్యయనం చేసి భారతీయ విద్యా అవసరాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఐదు రోజుల శిక్షణా కార్యక్రమంలో నిపుణులు వివిధ అంశాలపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థి కేంద్రిత బోధన, ఉపాధ్యాయులకు నిరంతర నైపుణ్యాభివృద్ధి, ఇటువంటి ఎఫ్‌డిపి కార్యక్రమాలు జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నూతన అంశాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం, బోధనలో భాగం చేయడం ఎంతో అవసరమన్నారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఆధునిక బోధనా విధానాలను తప్పనిసరిగా అవలంబించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడంతో పాటు విద్యార్థి కేంద్రిత బోధన, కార్యకలాపాల ఆధారిత అభ్యాసం, దృశ్య-శ్రవణ సాధనాల వినియోగం, ఆసక్తిదాయక పద్ధతులను తరగతి గదిలో అమలు చేయడం ద్వారా విద్యార్థులలో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, అభ్యసన నైపుణ్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అభ్యసనం వాయిదా వేయరాదని, ప్రత్యక్ష ఉదాహరణలతో బోధన చేయడం ఎంతో అవసరమన్నారు. ప్రాధమిక, ప్రాధమికోన్నత విద్య బోధనలో వ్యత్యాసాన్ని తెలియజేశారు. గణితంలో వెనుకబడే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ వారిని ప్రోత్సహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అధికంగా సైన్స్, గణితం అభ్యశించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. కాన్సెప్ట్, ప్రాధమిక అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (గుంటూరు) ఆచార్య టి. స్వరూప రాణి మాట్లాడుతూ... సంప్రదాయ బోధనకు మాత్రమే పరిమితం కాకుండా ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఇన్నోవేటివ్ టీచింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ వంటి ఆధునిక బోధనా పద్ధతులను అధ్యాపకులు అలవర్చుకోవాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తమ విద్యాసంస్థల్లో ఆచరణలో పెట్టినప్పుడే ఈ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య జె.వి. మధుసూదన్ మాట్లాడుతూ అభ్యసనం లేకపోతే వెనకబడి పోతామన్నారు. ఐఏఎస్‌ఈ ప్రిన్సిపల్, ఎఫ్.డి.పి కన్వీనర్ ఆచార్య డి. నగరాజ కుమారి మాట్లాడుతూ వైవిధ్యమైన బోధన విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిజిటల్, ఏఐ టూల్స్‌ను వినియోగిస్తూ బోధన బలోపేతం చేయాలని సూచించారు.
కార్యక్రమానికి డా. ఎన్. సోనీ హవిలా, డా. ఎం. పుష్ప రాజ్యం సహ-కన్వీనర్లుగా వ్యవహరించారు. డా. జి. విద్యావతి, డా. కె. తిరుమలాంబ, డా. వై. శ్రీదేవి సభ్యులుగా కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.





Comments
Post a Comment