Skip to main content

ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం - ‘తల్లికి వందనం’పై సీఎం, విద్యాశాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలి : శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. విశాఖపట్నం లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ - కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను వంచిస్తోంది - తల్లికి వందనం' స్కీమ్ లో కోతలపై చంద్రబాబు ప్రకటన చేయాలి - బడ్జెట్ కేటాయింపులు తగ్గించి ఎస్సీ, బీసీ విద్యార్థులకు అన్యాయం - పాఠశాలల్లో సిలబస్ సహా నిర్వహణను గాలికొదిలిన చంద్రబాబు సర్కారు - కూటమి పాలనలో భ్రష్టు పట్టిన విద్యావ్యవస్థ - ఉత్తరాంధ్రలో పంచదార కొండతో పాటు, గీతం విద్యాసంస్ధల భూదోపిడీ - అయినా స్పందించని ప్రభుత్వం : కూటమి .

.                   K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మాయమాటలతో మోసం చేస్తోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైఎస్. జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన 'అమ్మఒడి' పథకానికి పేరు మార్చి 'తల్లికి వందనం'గా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం, దాని అమలులో తీవ్ర విఫలమైందని మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తూ, అర్హులైన ఎస్సీ, బీసీ విద్యార్థులకు అరకొరగా నిధులు విడుదల చేస్తూ మోసగిస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారుల సంఖ్యపై ఉద్దేశపూర్వక మాయాజాలానికి తెరలేపారని విమర్శించిన ఆయన, అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని ఎటువంటి కోతలు లేకుండా ఒకే విడతలో వర్తింపజేయాలని, దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..


- తల్లికి వందనం పథకంలో కోతలు – బడ్జెట్ మాయాజాలం..


అమ్మఒడి పథకం ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదు, మా ప్రభుత్వం తెచ్చిన పథకానికి పేరు మార్చి కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చుకోవడం సహజమే కానీ, దీన్ని సక్రమంగా అమలు చేయడం లేదు. తొలి ఏడాది ఉద్దేశపూర్వకంగానే పిల్లలకు పథకం ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, నీకు రూ.15వేలు, నీకు రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక రూ.2,000 తగ్గించి రూ.13,000 మాత్రమే ఇస్తున్నారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో స్కూళ్ల నిర్వహణ కోసం రూ.2,000 తగ్గించినప్పుడు మీరేం చెప్పారు? స్కూల్ మెయింటెనెన్స్ ప్రభుత్వం చూసుకుంటుంది, మేం అధికారంలోకి వస్తే  రూ.15,000 పూర్తిగా ఇస్తామన్నారు కదా! మరి ఇప్పుడెందుకు మాట తప్పారు? మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్ల నిర్వహణ, నాడు -నేడుని పూర్తిగా అటకెక్కించారు.


రాష్ట్రంలో ప్రీ-ప్రైమరీ కలుపుకుంటే యూడైస్ (UDISE) లెక్కల ప్రకారం 86 లక్షల మంది, వారిని తీసేస్తే సుమారు 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. రూ.15,000 చొప్పున లెక్కలేస్తే దాదాపు రూ.13,000 కోట్లు కావాలి. కానీ, ప్రభుత్వం బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో రూ.9,648 కోట్లు చూపించి, రివైజ్డ్ బడ్జెట్‌లో దాన్ని రూ.8,456 కోట్లకు తగ్గించింది. వాస్తవంగా ఎంత రిలీజ్ చేశారో దేవుడికే తెలియాలి. నేను చెప్పేవాటిలో ఏ ఒక్కటైనా తప్పు ఉంటే నిరూపించండి, నా మాటలు వెనక్కి తీసుకుని సభకు క్షమాపణ చెబుతాను.


- ఎస్సీ, బీసీ విద్యార్థులకు అన్యాయం..


కౌన్సిల్‌లో నేను ఈ విషయంపై ప్రశ్నిస్తే కొందరు మంత్రులు నాపైకి కుస్తీ పోటీలకు వచ్చినట్లు లేచారు. ఇది కుస్తీ పోటీ కాదు, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎస్సీ, బీసీ విద్యార్థులకు చాలా చోట్ల కేవలం రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారని అడిగి నాలుగు నెలలవుతున్నా సమాధానం లేదు.

నేను అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడే ఈ విషయాలు చెబుతున్నాను. అందరికీ పూర్తి డబ్బులు అందలేదని అధికారులు కూడా అంగీకరించారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో నేను స్వయంగా బాధితులతో మాట్లాడాను. ఒక్కో స్కూల్లో 13 నుంచి 16 మందికి పైగా విద్యార్థులకు ఇంకా రూ.4,000 బ్యాలెన్స్ రావాల్సి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడైనా అరకొరగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉంటే నిరూపించండి, నేను తలదించుకుంటాను. చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని పక్కనపెట్టి కేవలం పబ్లిసిటీ కోసమే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.


-  విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది..


మా ప్రభుత్వంలో 'నాడు-నేడు' కింద మొదటి, రెండో విడతల్లో సుమారు 40,000 పాఠశాలలను బాగు చేయడానికి రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ నేడు ఆ పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు  ఊర్లో వాళ్లు విరాళాలు ఇస్తేనే స్కూల్ పనులు పూర్తి చేస్తామంటున్నారు. ఏంటి ఈ కర్మ? రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యం, ఆహారం అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై లేదా?

మా ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పోయింది, సీబీఎస్‌ఈ  సిలబస్ లేదు, ఐబీ కరికులమ్ ఊసే లేదు. మేము తెచ్చిన టోఫెల్ శిక్షణ ఎక్కడ ఉందో చెప్పండి? 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని తెచ్చి స్పెషలైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తే, ఇప్పుడు ఆ విధానాన్నే తీసేశారు. స్కూళ్లు ప్రారంభమై ఇన్ని నెలలైనా విద్యార్థులకు టెక్స్ట్‌బుక్స్, బట్టలు, నోట్‌బుక్స్, షూ, బెల్టులు సరిగ్గా ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనంలో చిక్కీలు ఇచ్చే పర్యవేక్షణ కూడా లేదు. చిన్న చిన్న విషయాలను కూడా మానిటర్ చేయలేని ముఖ్యమంత్రి, కొండలు దాటిపోయే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.


- ఉత్తరాంధ్రలో దోపిడీ – రాజధానిపై మాయమాటలు..


ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూటమి నేతల అరాచకాలు పెరిగిపోయాయి. ఒకవైపు గీతం  సంస్థలకు చెందిన 50 ఎకరాల భూములను దోచేస్తున్నారు. పవిత్రమైన పంచదార కొండను మైనింగ్ పేరిట దోపిడీ చేస్తున్నారు.  ఆంధ్రజ్యోతి పత్రికలో అశోక్ గజపతిరాజు గారి ఫోటో వేసి, నాటి అరాచకానికి నేడు అండ అని రాశారు. అసలు ఎవరిది అరాచకం? దీనిపై రేపు విజయనగరంలో పూర్తి వివరాలతో సమాధానం చెబుతాను. మా పార్టీ ఆఫీసు కట్టింది ఒక ఎకరం భూమిలోనే, అది కూడా శంకర్ ఫౌండేషన్‌తో పాటు గతంలో ప్రభుత్వం కేటాయించిందే. కంటికి కనిపిస్తున్న వందల ఎకరాల దోపిడీ వీరికి కనిపించడం లేదా?

ఫీజ్ రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ఈ ప్రభుత్వం ఇంకా రూ.10,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవ్వలేనప్పుడు ఎందుకు అంత పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు? పీ4 పథకం కనీసం 5 శాతం మందికైనా అమలు చేశారా? అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు లేవు, కేవలం ఆ పేరుతో దోపిడీ చేస్తున్నారు. మేము గతంలో 'మావిగన్' (Mavigon) అని చెబితే అవహేళన చేశారు, కానీ మూడు రోజుల క్రితం చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడిన మాటలు వింటేనే వాస్తవాలు ఏంటో అర్థమవుతాయి. ప్రజల ఆశలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.


- వైఎస్ జగన్ పర్యటనలపై శవరాజకీయాలు సిగ్గుచేటు..


వరదలు వచ్చినా, బోట్లు ప్రమాదానికి గురైనా వైఎస్. జగన్ బాధితులను పరామర్శించడానికి వస్తే, దాన్ని కూటమి నాయకులు 'శవరాజకీయం' అని విమర్శించడం సిగ్గుచేటు. గతంలో బోట్లు కాలిపోతే మా ప్రభుత్వం ఒక్కో బోటుకు రూ.35 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకుంది. ప్రజల కష్టాలపై ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలి కానీ, ప్రతిదానికి రాజకీయం మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నాయకుడు బాధితుల వద్దకు రాకూడదా? వస్తే రాజకీయం అంటారు, రాకపోతే ఎందుకు రాలేదని ప్రశ్నిస్తారు. రాజకీయాలు వేరు, మానవత్వం వేరు. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యుల అంత్యక్రియల్లో ప్రభుత్వ లాంఛనాలు వద్దని వారి కుటుంబమే స్పష్టంగా చెప్పింది. దాన్ని కూడా రాజకీయం చేయడం తప్పు. లాంఛనాలు వద్దని కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పుడు అంబటి రాంబాబు గారు చేసింది ముమ్మాటికీ ఒప్పే.


-  అవకతవకలపై యాప్ – ఈసీకి విజ్ఞప్తి..


ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో కొందరు అధికారులు నెంబర్లు పెంచుకోవాలనే తాపత్రయంతో అవకతవకలకు పాల్పడుతున్నారని... ఇలాంటి అక్రమాలు జరగకుండా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు.  ఏ చిన్న పని కావాలన్నా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు వెన్నుపోటు పార్టీ (టీడీపీ) నాయకులు చేస్తున్న ఇలాంటి అరాచకాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మేము ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Comments