Skip to main content

వర్షాకాలం పొంచి ఉన్నందున గెడ్డలు, కాలువలు పొంగకుండా చర్యలు చేపట్టాలి. *జీవీపీ ల నిర్మూలన, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి కుక్కల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

.                        K.V.SHAA EDITOR 
విశాఖపట్నం, జూలై 7: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో గెడ్డలు, కాలువలు పొంగి పొరలకుండా  ముందస్తు చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఆరోగ్య విభాగ సమీక్ష సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్ కుమార్, సహాయ వైద్యాధికారులు, శానిటరీ  సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులు పాల్గొనగా జోనల్ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ మరియు ప్రజా ఆరోగ్య విభాగాలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి కాలువలు, గెడ్డల్లో వర్షపు నీరు పొంగకుండా ప్రణాళిక బద్ధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని, గెడ్డలు, కాలువలలో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లయితే మురుగు, వర్షపు నీరు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా పోయే విధంగా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


నగరాన్ని పూర్తిస్థాయిలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (GVPs) రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న జీవీపీలను శాశ్వతంగా తొలగించి వాటిని గ్రీన్ స్పాట్లుగా అభివృద్ధి చేయాలని, ప్రతి కాలనీ, వీధి, ప్రధాన రహదారి పరిశుభ్రంగా ఉండేలా సహాయ వైద్యాధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాల వద్ద బహిరంగంగా చెత్త వేస్తున్న వారిపై నిర్భయంగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. నగర పరిశుభ్రత విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్లాప్ వాహనాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని, ఇంటింటి చెత్త సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు. వ్యర్థాల సేకరణలో అలసత్వం వహిస్తే  క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


వీధి కుక్కల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీధి కుక్కలను నియంత్రించేందుకు జోన్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి నివేదికను సమర్పించాలని జీవీఎంసీ సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ కిరణ్ కుమార్‌ను ఆదేశించారు. నగరంలో ప్రజా రవాణా ఆటోల నుంచి రోడ్లపై విరివిగా వ్యర్ధాలు పడవేయడాన్ని గుర్తించామని, తద్వారా రోడ్లు అపరిశుభ్రతకు గురవుతున్నాయన్నారు. ఈ విషయమై ఆటో యూనియన్లతో సమావేశాలు నిర్వహించి ప్రతి ఆటోలో చిన్న డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకునేదా వారికి అవగాహనపరిచి తగిన చర్యలు తీసుకోవాలని సహాయ వైద్యాధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు నగర పరిశుభ్రతకు ఎంతో శ్రమిస్తున్నారని వారికి జీతాలు నిర్ణీత గడువులోపు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీతాల చెల్లింపులో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజారోగ్య విభాగం పనితీరు, పారిశుద్ధ్య నిర్వహణ, గెడ్డలు, కాలువలలో పూడికల తొలగింపు, వీధి కుక్కల నియంత్రణ కు తగిన చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ నల్లనయ్యకు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్  నరేష్ కుమార్ లకు కమిషనర్ ఆదేశించారు

ఈ కార్యక్రమంలో స్టాటిస్టికల్ అధికారి పి డి వి ప్రసాద్, బయాలజిస్ట్ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ.

Comments