నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, విద్యార్థులపై బీజేపీ నేతలు–పోలీసుల దాడి, అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి –* *నీట్ లీకేజీ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి మౌనం ఎందుకు?* *ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి డిమాండ్* అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం:
K.V.SHARMA EDITOR
అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనల వల్ల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంటులో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై ప్రతిపక్ష ఎంపీలు ఇండియా కూటమి నాయకుల పైన అలాగే ఈ అంశంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై బీజేపీ నాయకులు, పోలీసుల ద్వారా దాడులు చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె తీవ్రంగా ఖండించారు.
ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షం యొక్క రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటికి బదులివ్వకుండా ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని ఆమె విమర్శించారు. దేశ యువత, నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై పారదర్శక విచారణ జరిపి నిజాలను ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అత్యంత కీలకమైన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని, విద్యార్థుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
విద్యా వ్యవస్థలో వరుసగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు యువతలో తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయని, కష్టపడి చదివే అర్హులైన విద్యార్థులకు ఇది తీవ్రమైన అన్యాయమని శాంతకుమారి పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన పరీక్షల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణిచివేయాలనే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దేశ ప్రజలు, విద్యార్థులు, యువత హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని పాచిపెంట శాంతకుమారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజిసోమేశ్వరరావు కిసాన్ కాంగ్రెస్ అల్లూరు జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి అరకు పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోషే ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టి భీమారావు కుమ్మిడిశెట్టి అచ్చి బాబు కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment