శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. గిరి ప్రదక్షిణ, భక్తుల సౌకర్యాల దృష్ట్యా అభివృద్ధి పనులను పరిశీలించిన ఈవో జల్లేపల్లి వెంకటరావు
K.V.SHARMA EDITOR
సింహాచలం, జూలై 6:శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కొండపై, కొండక్రింద జరుగుతున్న పలు ఇంజనీరింగ్ అభివృద్ధి పనులను ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జరుగుతున్న పనుల నాణ్యత, పురోగతిని సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రానున్న గిరి పౌర్ణమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే నేపథ్యంలో, అడవివరం సెంటర్ నుంచి గాంధీనగర్ మీదుగా స్వామివారి పుష్కరిణి వరకు భక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆలయ డీఈ ఇన్‌చార్జి రామరాజు, సింహాచలం మాజీ కార్పొరేటర్ పీవీ నరసింహాతో కలిసి రహదారిని పరిశీలించారు.
అనంతరం స్వామివారి తొలి పావంచ వద్ద నిర్మాణంలో ఉన్న టెన్సైల్ షెడ్ పనులను పరిశీలించి, గిరి పౌర్ణమి నాటికి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ ఇన్‌చార్జి రామరాజుకు సూచించారు. అలాగే గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు ప్రత్యేకంగా గట్టర్ల ఏర్పాటు విషయమై అధికారులతో చర్చించారు.
కొండ దిగువనున్న బస్సు స్టాండ్ వద్ద పాత భవనం కూల్చివేత పనులను పరిశీలించిన ఈవో, బస్సుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కొండపై భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు బ్లూ స్టార్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన వాటర్ కూలర్లను క్యూ లైన్లలో ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు. అదేవిధంగా, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు వారి వద్దకే తాగునీరు అందించేలా వాటర్ బ్యాక్ ట్యాంకులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్ దర్శన టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు, ప్రసాదాల టికెట్ల విక్రయాన్ని ఒకే కేంద్రంలో నిర్వహించే విధంగా చేపడుతున్న ఏర్పాట్లను ఈవో పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి గజపతి సత్రంలో జరుగుతున్న ఇంజనీరింగ్, సానిటేషన్ పనులను పరిశీలించి, పరిశుభ్రతతో పాటు నాణ్యత ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఆలయ డీఈ ఇన్‌చార్జి రామరాజు, సంబంధిత ఇంజనీరింగ్ శాఖ , సిబ్బంది పాల్గొన్నారు.








Comments
Post a Comment