ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలి* * నేడు, రేపు ప్రత్యేక క్యాంపెయిన్ ను సద్వినియోగం చేసుకుని మిగిలిన ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి * రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, జూలై 10: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి బీఎల్‌వోలు, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) పరస్పర సమన్వయంతో పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
జిల్లాలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల సంఖ్య సుమారు 3.5 లక్షలు ఉన్నట్లు గుర్తించామని, వీటికి సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు చురుకుగా సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 15 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి అందాయని, ఇంకా సుమారు 1.5 లక్షల ఫారాలు సేకరించాల్సి ఉందన్నారు. మిగిలిన నాలుగు రోజులు అత్యంత కీలకమైనవని, ప్రతి బీఎల్‌వో, బీఎల్‌ఏ సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు శనివారం, ఆదివారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా ఎన్యూమరేషన్ ఫారం (ఈఎఫ్) సమర్పించని వారు ఈ రెండు రోజుల్లో తప్పనిసరిగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భాగంగా జిల్లాలో గుర్తించిన ఆబ్సెంట్, షిఫ్టెడ్, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీల పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments
Post a Comment