*ఈ వారం రోజులు యుద్ధప్రాతిపదికన ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలి* * విస్తృత ప్రచారంతో ఈఎఫ్‌ల సేకరణ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, జూలై 7: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు మిగిలిన వారం రోజులు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు), అదనపు ఈఆర్వోలు, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వోలు), స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూలై 11, 12 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఈఎఫ్‌ల పంపిణీ, సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఇంకా ఈఎఫ్‌లు అందని ప్రతి ఓటరికి ఫారాలు అందించి, పూర్తిచేయించి వెంటనే తిరిగి సేకరించాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా హోర్డింగులు ఏర్పాటు చేయాలని, సినిమా థియేటర్లలో స్లైడ్లు ప్రదర్శించాలని, సోషల్ మీడియా, ప్రధాన మీడియా, ఆటో మైకుల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. జూలై 14 వరకు అవగాహన కార్యక్రమాలు, ఈఎఫ్‌ల సేకరణ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సూచించారు.
అన్ని ఈఆర్వోలు తమ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, ప్రముఖులు నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈఎఫ్‌ల సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫోన్ నంబర్ల ఆధారంగా ఆచూకీ లభించని ఓటర్ల వివరాలను సేకరించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి స్పెషల్ ఆఫీసర్ ఈ వారం కనీసం మూడు పోలింగ్ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని, ఈఆర్వోలు పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతిని ప్రతిరోజూ సమీక్షించాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో అదనపు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
*నేడు కలెక్టరేట్, జీవీఎంసీలో ప్రత్యేక శిబిరాలు*
బుధవారం కలెక్టరేట్, జీవీఎంసీ కార్యాలయాల్లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌లు, శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్, వీఎంఆర్డీఏ తదితర ప్రజా రద్దీ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ప్రచార శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి దశను పారదర్శకంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి, జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా ముగించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Comments
Post a Comment