Skip to main content

పాత గోశాల, అడవివరం జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టండి. * వాహన రాకపోకలకు అనుకూలంగా సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

.                   K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం, జూలై 16: విశాఖ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనదారులకు సులభమైన రాకపోకలు కల్పించే లక్ష్యంతో నగరంలోని ప్రధాన జంక్షన్లను ఆధునికంగా అభివృద్ధి చేసి సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మధురవాడ జోన్ 98వ వార్డు పరిధిలోని తొలి పావంచ, పాత గోశాల,  అడవివరం జంక్షన్లను పర్యవేక్షక ఇంజనీరు శాంతిరాజ్, నిప్పాన్ కోయి సంస్థ ప్రతినిధులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల కారణంగా ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించి, వాహనదారులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన పరిస్థితులు అన్నాయని తెలిపారు. దీనివల్ల ప్రజలు తమ గమ్యస్థానాలకు నిర్ణీత సమయంలో చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసేందుకు పాత గోశాల, అడివి వరం జంక్షన్లను ఆధునిక సదుపాయాలతో అందంగా తీర్చిదిద్ది సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేపట్టమన్నారు.  పాత గోశాల – అడవివరం జంక్షన్‌లను అభివృద్ధిపరిచి ఆధునికంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికలు, నమూనాలు, అంచనాలను సిద్ధం చేయాలని, ఈ జంక్షన్ల అభివృద్ధికి ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు. రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ ప్రవాహం, యూ-టర్న్‌లు, సర్వీస్ రోడ్లు, పాదచారుల భద్రత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. నిప్పాన్ కోయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు సిగ్నల్ ఫ్రీ జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి పలు సాంకేతిక సూచనలను కమిషనర్ కు వివరించారు. వాటిని పరిశీలించిన కమిషనర్ అవసరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణకు అనువైన నమూనాలను రూపొందించి త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీర్  శాంతిరాజును ఆదేశించారు.

ఈ పర్యటనలో సహాయక వైద్యాధికారి డాక్టర్ ఎల్ రాజా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

పౌర సంబంధాల అధికారిజీవీఎంసీ.

Comments