Skip to main content

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం* *గంజాయి రవాణా మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి *ఎన్ కార్డు సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌


విశాఖపట్నం, జూలై 18 ః జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. గంజాయి రవాణా మార్గాలపై నిఘాను పెంచడంతో పాటు, విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు బానిసలు కాకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్‌ సెంటర్‌ (NCORD) కమిటీ సమావేశంలో మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలను ఆయన సమీక్షించారు.


ఒడిశా నుంచి విజయనగరం సరిహద్దుల మీదుగా జిల్లాలోకి గంజాయి తరలించే మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు, చెక్‌పోస్టులు, ఇతర రవాణా మార్గాల్లో పోలీసు, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, నైట్‌ విజన్‌ పరికరాలు, స్నిఫర్‌ డాగ్స్‌ వినియోగాన్ని పెంచాలని తెలిపారు. సముద్ర మార్గం ద్వారా సింథటిక్‌ డ్రగ్స్‌, కొకైన్‌ వంటి మాదకద్రవ్యాలు జిల్లాలోకి రాకుండా విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు పరిధిలో కస్టమ్స్‌, కోస్ట్‌గార్డ్‌, పోర్టు, పోలీసు శాఖలు సమన్వయంతో ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్‌ అక్రమ రవాణా వెనుక ఉన్న లింకేజీలను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.


మాదకద్రవ్యాలకు బానిసైన వారిని డీ-అడిక్షన్‌, కౌన్సెలింగ్‌, రీహాబిలిటేషన్‌ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కేజీహెచ్‌, గ్రీన్స్‌ వ్యాలీ తదితర కేంద్రాల్లో అందుతున్న సేవలను అవసరమైన వారికి అందేలా చూడాలన్నారు. విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు. మద్యం దుకాణాల సమీపంలో బహిరంగంగా మద్యం సేవించకుండా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు, ఎన్‌సీబీ, కోస్ట్‌గార్డ్‌, కస్టమ్స్‌, పోర్టు, రైల్వే, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతున్నాం ః పోలీస్ క‌మిష‌న‌ర్*పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ 2026 జూన్‌ వరకు 117 ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదు చేసి 223 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 617.29 కిలోల గంజాయి, 10.83 గ్రాముల ఎండీఎంఏ, 3.2 లీటర్ల హాషిష్‌ ఆయిల్‌, మూడు ఎల్‌ఎస్‌డీ బ్లాట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. త‌ర‌చూ మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడుతున్న వారిపై 837 డ్రగ్‌ ఆఫెండర్‌ షీట్లు తెరిచినట్లు చెప్పారు. డ్రగ్‌ ట్రాఫికర్ల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై 26 కేసుల్లో ఆర్థిక దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ‘ఆపరేషన్‌ వజ్ర ప్రహర్‌’లో భాగంగా డ్రగ్స్‌ హాట్‌స్పాట్లలో ప్రత్యేక తనిఖీలు, కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో డ్రోన్లతో నిఘా కొనసాగుతోందని, సీసీ కెమెరాలు, స్నిఫర్‌ డాగ్స్‌ వినియోగాన్ని మరింత విస్తరిస్తున్నట్లు చెప్పారు.


సమావేశంలో డీసీపీలు మేరీ ప్ర‌శాంతి, మ‌ణికంఠ‌, ఈగ‌ల్ అద‌న‌పు ఎస్పీ చుక్కా శ్రీ‌నివాస్, సీఐ క‌ళ్యాణి, ఇత‌ర పోలీసు అధికారులు, నార్కోటిక్స్‌, కోస్ట్‌గార్డ్‌, కస్టమ్స్‌, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, ఆర్టీసీ, కేజీహెచ్‌, వైద్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments