ఘనంగా ఏయూ సేతు కార్యక్రమం ప్రారంభం -జువాలజీ పూర్వ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం -విద్యార్థులకు అవగాహన కల్పించిన పూర్వ విద్యార్థి మూర్తి
K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏయూ - సేతు కార్యక్రమం గురువారం ప్రారంభమయింది. జువాలజీ విభాగంలో పూర్వవిద్యార్థి కె.మూర్తి ప్రత్యేక ప్రసంగంతో విద్యార్థులను పూర్వవిద్యార్థులతో అనుసంధానం చేసే వారధిగా తొలి కార్యక్రమాన్ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ వణ్యప్రాణుల ఆవాసాలను మనం స్వాధీనం చేసుకుంటున్నామని, ఇవి ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నారు. పట్టణీకరణ నేపధ్యంలో అనేక జీవులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. తూర్పు కనుములు ఎంతో జీవ వైవిధ్యతను కలిగిందన్నారు. ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా వణ్యప్రాణి సంరక్షణ దిశగా విశిష్ట సేవలు అందిస్తున్న విభాగ పూర్వవిద్యార్థి కె.మూర్తిని ఆహ్వానించడం మంచి పరిణామమన్నారు. పూర్వ విద్యార్థుల జ్ఞానాన్ని, నైపుణ్యాలను, మెళకువలను నేటి తరం అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. నేటి తరాన్ని నాటి తరంతో అనుసంధానించే విధంగా ఏయూ సేతు కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అమలు చేయడం జరుగుతోందన్నారు.
ఆలుమ్ని రిలేషన్స్ డీన్ ఆచార్య పి.శ్యామల మాట్లాడుతూ పూర్వ విద్యార్థులకు, నేటి తరం విద్యార్థులకు మధ్య వారధిగా ఏయూ సేతు పనిచేస్తుందన్నారు. దీనికోసం మెంటార్, మెంటి రిజిస్ట్రేషన్ ప్రారంభించామన్నారు. తొలి కార్యక్రమంలో జువాలజీ విభాగంలో దీనిని లాంఛనంగా ప్రారంభించామన్నారు. ఇప్పటికే 10 మంది పూర్వ విద్యార్థులు మార్గదర్శకం అందించడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిని విభాగంలోని 70 మంది విద్యార్థులతో అనుసంధానించి, వారికి అవసరమైన విభాగంలో ప్రత్యేఖ శిక్షణ అందిస్తామన్నారు. విద్యార్థులలో విభిన్న నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
వణ్యప్రాని సంరక్షకులు, ఈస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధి కె.మూర్తి మాట్లాడుతూ ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పాములపై అవగాహన కల్పించారు. భారత దేశంలో 300 రకాలకుపైగా పాములు ఉన్నాయన్నారు. జీవావరణంలో వాటి ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను వివరించారు. తాము కింగ్ కోబ్రాల రక్షణకోసం చేస్తున్న కృషి, ప్రాజెక్టులను వివరించారు. పాములపై ప్రజలకు ఉన్న అపోహలు, భయాలు వాటి మరణానికి కారణంగా మారుతున్నాయన్నారు. నాగమణి ఉంటుందని, పాలు త్రాగుతాయనే ఆపోహలు వీడాలని సూచించారు. పాములను ఆరాధించడం తప్పుకాదని, వీటిని హింసించడాన్ని తాము నిలువరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాలలో పలు ప్రాంతాలలో కింగ్ కోబ్రాలను గుర్తించడం, సంరక్షించడం జరుగుతోందన్నారు. ప్రతీ సంవత్సరం 50 వేల మందికిపైగా పాముకాటుతో మన దేశంలో మరణిస్తున్నారన్నారు. అంతకంటే ఎక్కువ మంది అవయవాలను కోల్పోవడం జరుగుతోందన్నారు.
పాములు మనం ఉండే ప్రాంతానికి రావడానికి కారణం వాటి సహజ ఆవాసాలను కోల్పోవడమేనన్నారు. కింగ్ కోబ్రాలు అధికంగా ఇతర విషపు పాములను ఆహారంగా తీసుకుంటాయన్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ వీటి సంరక్షణకు కృషి చేస్తున్న విధానాన్ని వివరించారు.
కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య మంజులత, ఏయూ ఆలుమ్ని రిలేషన్స్ అసోసియేట్ డీన్‌లు ఆచార్య ఎన్.సాల్మన్ బెన్ని, ఆచార్య ఏ.నాగ హనుమాన్ తదితరులు పాల్గొన్నారు



Comments
Post a Comment