Skip to main content

ఉత్కళ్ సంస్కృతిక సమాజ్ ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమైన రథయాత్ర

.                 K.V.SHARMA EDITOR 
విశాఖ సందేశం: జూలై:విశాఖపట్నంలో ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ ఉత్కళ సంస్కృతిక సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక రథయాత్ర ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు శ్రీ జగన్నాథుడు, ఆయన సహోదరులు శ్రీ బాలభద్రుడు, దేవి సుభద్రమ్మలతో అలంకరించిన రంగురంగుల రథాన్ని భక్తులు భారీగా పాల్గొని లాగారు.


హరి బోల్ నినాదాలు, భజనలు, సంకీర్తనలు, వేద మంత్రోచ్చారణల మధ్య జగన్నాథ ఆలయం ప్రాంగణం నుంచి బీచ్ రోడ్‌లోని లాసన్స్ బే కాలనీలో శాంతి ఆశ్రమం సమీపంలోని గుండిచా ఘాట్ (అత్తగారి ఇల్లు) వరకు రథయాత్ర నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.


పురిలోని శ్రీ జగన్నాథ ధామ్‌లో జరిగే ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రతో సమకాలంలో ఈ వేడుకను నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండగా, యూఎస్ఎస్ సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసింది. సంవత్సరంలో ఒక్కసారే దేవతలను గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చి అందరికీ దర్శనం కల్పించడం ఈ ఉత్సవ ప్రత్యేకత. బహుదా యాత్ర (తిరుగు యాత్ర) వరకు దేవతలు గుండిచా ఘార్‌లోనే ఉంటారు.పహాండి బిజే అనే సంప్రదాయం ప్రకారం దేవతలను గర్భగుడి నుంచి రథానికి తీసుకువచ్చారు. పురి రాజు నేలను ఊడ్చే ఆచారాన్ని సూచిస్తూ సమాజ్ అధ్యక్షుడు, ఓఎస్ఎల్  గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉపాధ్యక్షుడు జేకే నాయక్ ఈ పూజా విధిని నిర్వహించారు. ఒడిశాలోని గంజాం జిల్లాలోని నరేంద్రపూర్ గంజాం ఫోక్ డాన్స్ సెంటర్ కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వూడా చిల్డ్రన్స్ పార్క్, ఏయూ గేట్, పార్క్ హోటల్, వీఎంఆర్‌డీఏ పార్క్ ప్రాంతాల గుండా రథయాత్ర సాగి లాసన్స్ బే కాలనీలోని గుండిచా ఘార్‌కు చేరుకుంది. అక్కడ జూలై 24 వరకు దేవతలు విశ్రాంతి తీసుకుంటారు.మార్వాడి యువ మాంచ్ సభ్యులు భక్తులకు తాగునీరు అందించారు. వివిధ కళాకారుల ప్రదర్శనలు, ఒడిశా ప్రభుత్వ సాంస్కృతిక శాఖ తరఫున నిర్వహించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా యూఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సత్యబ్రత ద్విబేది భక్తులకు కృతజ్ఞతలు తెలిపి బహుదా రథయాత్ర వరకు గుండిచా ఘార్‌ను సందర్శించి స్వామివారి దర్శనం పొందాలని కోరారు.

Comments