పరిశోధనలతో దేశ ప్రగతికి బాటలు వేయాలి -ఆరోగ్య, ఆర్ధిక, అంతరిక్ష రంగాలలో భారత్ ప్రగతి - ‘ఇస్రో అకాడెమియా కనెక్ట్ @ ఏయూ’ నిర్వహణ - విద్యార్థులే వికసిత్ భారత్‌కు చోదకశక్తి - ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణన్
ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 31:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)–ఆంధ్ర విశ్వవిద్యాలయం మధ్య అకడెమిక్, పరిశోధనా భాగస్వామ్యానికి నాంది పలుకుతూ ‘ఇస్రో అకడెమియా కనెక్ట్ @ ఏయూ’ కార్యక్రమం శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని డాక్టర్ వై.వి.ఎస్. మూర్తి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణన్ వర్చువల్ విధానంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రారంభ ప్రసంగంలో డా. వి. నారాయణన్ మాట్లాడుతూ శతాబ్ధ చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిపాలనా నిపుణులను అందించిన గొప్ప విద్యాసంస్థ అని కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.ఆర్. రెడ్డి, సి.వి. రామన్ వంటి మహనీయులతో ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి జ్ఞాన కేంద్రంలో ఇస్రో అకడెమియా కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. పరిశోధనలతో దేశ ప్రగతికి బాటలు వేయాలని సూచించారు. ఆరోగ్య, అంతరిక్ష, ఆర్ధిక రంగాలలో దేశం అద్వితీయ ప్రగతి సాధిస్తోందన్నారు. ప్రపంచం భారత దేశం వైపు ఆసక్తిగా చూస్తోందని, మన ఆవిష్కరణలు, అంతరిక్ష ప్రగతి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.
దేశాన్ని ‘వికసిత్ భారత్–2047’గా తీర్చిదిద్దాలంటే విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు పరస్పరం భాగస్వామ్యంతో పనిచేయాలని డా. నారాయణన్ సూచించారు. గతంలో పరిశోధనలు పరిశోధనా పత్రాలకే పరిమితమయ్యేవని, ఇప్పుడు అవి పేటెంట్లు, సాంకేతిక ఉత్పత్తులు, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలుగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం–ఇస్రో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు పరిశోధన, ఇంటర్న్‌షిప్ అవకాశాలు పెరిగి, దేశ అంతరిక్ష కార్యక్రమానికి ఉపయోగపడే ఆవిష్కరణలు వెలువడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత విక్రమ్ సారాభాయ్ దూరదృష్టితో ప్రారంభించిన అంతరిక్ష ప్రయాణం నేడు ప్రపంచ అగ్రగామి అంతరిక్ష శక్తి కలిగిన దేశంగా భారత్‌ను నిలబెట్టిందని తెలిపారు. టెలికమ్యూనికేషన్, వాతావరణ హెచ్చరికలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, మత్స్య సంపద, నీటి వనరుల నిర్వహణ, సరిహద్దు భద్రత తదితర 50కి పైగా రంగాల్లో ఇస్రో ఉపగ్రహాలు ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందిస్తున్నాయని వివరించారు. ఉపగ్రహాల ఆధారంగా మత్స్యకారులకు చేపల వేట ప్రాంతాల సమాచారం అందించడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తోందని చెప్పారు.
క్రయోజెనిక్ సాంకేతికతను భారత్‌కు ఇవ్వడానికి విదేశాలు నిరాకరించినప్పటికీ, భారత్ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసి ముందుకు సాగి విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్లతో అత్యాధునిక రాకెట్లను ప్రయోగిస్తూ భారత్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ఇటీవల అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని భారత రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టడం దేశ అంతరిక్ష సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు.
చంద్రయాన్ ప్రయోగంతో భారత్ చరిత్ర సృష్టించిందని, ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత కూడా భారత్‌కే దక్కిందని గుర్తుచేశారు. 2035 నాటికి భారత స్వంత అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి భారతీయుడిని భారతీయ రాకెట్ ద్వారానే చంద్రుడిపైకి పంపే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోందని వెల్లడించారు.
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఫాకల్టీ చైర్మన్ ఆచార్య జి.వి.ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి ప్రపంచంలో వ్యక్తిగత స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అభివృద్ధికి సహకారం అత్యంత కీలకమని అన్నారు. ఇస్రో వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విశ్వవిద్యాలయాల వద్ద పరిశోధనా సామర్థ్యం ఉన్నందున ఈ రెండింటి కలయికతో సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల (ఏ) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శశి మాట్లాడుతూ ఇస్రో అకడెమియా కనెక్ట్ కేవలం ఒక అవగాహన కార్యక్రమం కాదని, జ్ఞానం, ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతికి పునాది వేసే చారిత్రాత్మక అడుగని అన్నారు. తరగతి గది బోధనను అత్యాధునిక పరిశోధనలతో అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. సంయుక్త పరిశోధనలు, ఇంటర్న్‌షిప్‌లు, శాస్త్రీయ విజ్ఞాన మార్పిడి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన వంటి అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయని చెప్పారు.
ఇస్రో శాస్త్రవేత్త- సైంటిఫిక్ సెక్రటరీ ఎం.గణేష్ పిళ్లై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల నుంచే భవిష్యత్ అంతరిక్ష సాంకేతికతకు అవసరమైన ఆవిష్కరణలు రావాలని పిలుపునిచ్చారు. ఇస్రో దేశవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలకు మద్దతు అందిస్తోందని తెలిపారు. స్పేస్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ , స్పేస్ అప్లికేషన్ రంగాలలో ప్రోత్సహిస్తున్న విధానం వివరించారు. టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి వేదికల ద్వారా విద్యాసంస్థలతో ఇస్రో భాగస్వామ్యం కొనసాగుతోందన్నారు.
లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాలు, ప్రొపల్షన్, కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు. విద్యాసంస్థలు సిద్ధాంత పరిశోధనలకే పరిమితం కాకుండా దేశానికి ఉపయోగపడే ఉత్పత్తులు, ప్రోటోటైపులు అభివృద్ధి చేయాలని సూచించారు.
ఇస్రో సిబిపిఓ డైరెక్టర్ జి.హరిక్రిష్ణ మాట్లాడుతూ అభివృద్ధి, ప్రగతికి చోదక శక్తిగా విశ్వవిద్యాలయాలు నిలుస్తాయన్నారు. బాధ్యతాయుత పౌరులును తీర్చిదిద్దే వేదికగా వర్సిటీలు పనిచేస్తున్నాయన్నారు.
సదస్సు కన్వీనర్ ఆచార్య పి.మల్లికార్జున రావు మాట్లాడుతూ ఇస్రోతో అనుసంధానం చేస్తూ విశ్వవిద్యాలయాలను భాగం చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. అంతరిక్ష పరిశోధనలను మరింత విస్తృతం చేసే విధంగా సంయుక్తంగా కలసి పరిశోధనలు జరపాలన్నారు.
కార్యక్రమంలో ఇస్రో పిబిపిఓ డిప్యూటి డైరెక్టర్ కె.సతీష్ కుమార్ తదితరులు ప్రసంగించారు. అనంతరం అతిధులను విశ్వవిద్యాలయం తరపున సత్కరించారు. అనంతరం నిర్వహించిన సెషన్స్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ విభాగాలలో పరిశోధన అవకాశాలను వివరించారు.



Comments
Post a Comment