ఏయూలో ఎన్.ఐ.సి.ఇ.ఎస్-కోరల్ పరిశోధన కేంద్రం ప్రారంభం -ఎన్.ఆర్.ఎస్.సి సహకారంతో ఏర్పాటు - బ్లూ ఎకానమీ కి అత్యాధునిక ప్రయోగశాలలు కీలకం - ఎన్.ఆర్.ఎస్.సి డైరెక్టర్ డా. ప్రకాశ్ చౌహన్
K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూలై 17: సముద్ర వనరుల సుస్థిర వినియోగం, బ్లూ ఎకానమీ అభివృద్ధి, సముద్ర పరిశోధనల విస్తరణకు అత్యాధునిక ప్రయోగశాలలు కీలకమని నేషనల్ రిమోట్ సెన్సింగ్సెంటర్(ఎన్.ఆర్.ఎస్.సి) డైరెక్టర్ డా.ప్రకాశ్చౌహన్పేర్కొన్నారు.ఆంధ్రవిశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ బే అఫ్ బెంగాల్ లో ఏర్పాటు చేసిన ఎన్.ఐసిఇఎస్- కోస్టర్ అబ్జర్వేషన్ రీసెర్చ్ లేబరేటరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపగ్రహ సాంకేతికత, స్పెక్ట్రోస్కోపీ ఆధారిత పరిశోధనలతో సముద్ర జీవవైవిధ్యం, ఫైటోప్లాంక్టన్, జల నాణ్యత, మత్స్య వనరులపై మరింత ఖచ్చితమైన సమాచారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
భూమి ఉపరితలంలో సుమారు 70 శాతం సముద్రాలే ఉన్నందున భూమిని "ఓషన్ ప్లానెట్"గా పరిగణించవచ్చని పేర్కొన్న ఆయన, భారతదేశానికి 11 వేల కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం ఉండటం సముద్ర ఆధారిత అభివృద్ధికి గొప్ప అవకాశమన్నారు. రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాల ద్వారా మత్స్య సంపద, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, బ్లూ ఎకానమీ విస్తరణతో దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
సముద్ర పరిశోధనల్లో ఉపగ్రహ పరిశీలనలు, భూ స్థాయి నమూనాల విశ్లేషణలను సమన్వయం చేయడం ద్వారా మరింత విశ్వసనీయ శాస్త్రీయ సమాచారం లభిస్తుందని, పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధికి అలాంటి డేటా అత్యంత అవసరమని డా. చౌహన్ స్పష్టం చేశారు. ఈ కేంద్రం ద్వారా బహుళశాఖల పరిశోధనలు, అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాలు, విదేశీ శాస్త్రవేత్తల భాగస్వామ్యం మరింత విస్తరించేందుకు భారత అంతరిక్ష శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ బే ఆఫ్ బెంగాల్ అధ్యయన కేంద్రాన్ని జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. పరిశోధనా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు సిబ్బంది, ప్రాజెక్టు ఫెలోలను నియమించి కేంద్ర కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ అత్యాధునిక ప్రయోగశాలలు సముద్ర శాస్త్రానికే కాకుండా కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి రంగాల విద్యార్థులకు కూడా విస్తృత పరిశోధన అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. సాంకేతిక సిబ్బంది నియామకం, జాతీయ పరిశోధనా సంస్థలతో అవగాహన ఒప్పందాలు, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ కేంద్రాన్ని "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ దేశానికి తలమానింకగా కోరల్ కేంద్రం నివాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కేంద్రం సంచాలకులు ఆచార్య బి.బి.వి శైలజ మాట్లాడుతూ కేంద్ర ప్రగతి, నూతనంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలల ప్రాధాన్యతలను వివరించారు. సముద్ర శాస్త్ర అధ్యయనానికి ఈ ప్రయోగశాల ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్.ఆర్.ఎస్.సి డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ ఎన్.అపర్ణ, సిఎస్‌బిఓబి పూర్వ సంచాలకులు ఆచార్య పి.రాజేంద్రప్రసాద్, ఆచార్య రామారావు, తదితరులు పాల్గొన్నారు.






Comments
Post a Comment