K.V.SHARMA EDITOR
అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక భారత నౌకాదళంలో అధికారికంగా చేరింది. విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం అధికారికంగా నౌకాదళానికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఉన్న మహేంద్రగిరి పర్వతం పేరు మీదుగా ఈ యుద్ధనౌకకు నామకరణం చేశారని, పురాణాల ప్రకారం మహేంద్రగిరి పర్వతం పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశంగా చెబుతారన్నారు.ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను కలిగి ఉన్న మహేంద్రగిరి, నౌకాదళ ప్రాజెక్ట్ 17ఏ లో ఆరవ,చివరి యుద్ధనౌక అని తెలిపారు.ముంబై మజగావ్ డాక్‌యార్డ్స్ లిమిటెడ్ లో దీనిని నిర్మించారని తెలిపారు.మహేంద్రగిరి యుద్ధనౌక చిహ్నంపై ఉండే గరుడ పక్షి నిర్భయత్వం,
శౌర్యం, అజేయతకు ప్రతీక అని మహేంద్రగిరి ధైర్యానికి పరాకాష్టగా నిలుస్తుందన్నారు.భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని నిర్దేశించే సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా మరియు భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేసే వ్యవస్థలను రూపొందించడం ద్వారా దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు మరియు పెట్టుబడిదారులకు ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారతదేశంలో పెరుగుతున్న సముద్ర సామర్థ్యానికి మరియు సాంకేతిక స్వావలంబనకు ప్రతీకగా అభివర్ణించారు.
ఆరవ ప్రాజెక్ట్ 17 ఏ ఫ్రిగేట్‌ను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణంలో మరో మైలురాయి అని, ఇది భారత నౌకాదళం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. భారత నౌకాదళం యుద్ధానికి సిద్ధంగా, విశ్వసనీయంగా, సమన్వయంతో మరియు భవిష్యత్తుకు సన్నద్ధంగా ఉన్న శక్తిగా కొనసాగుతుందన్నారు.
సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓడపై ప్రత్యేకంగా ఎగురవేసే పొడవైన త్రిభుజాకారపు జెండా ఆవిష్కరించి,నౌకపై జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు..ఈ కార్యక్రమానికి తూర్పు నావికా దళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, మజగావ్ డాక్‌యార్డ్స్ లిమిటెడ్ సీఎండీ కెప్టెన్ జగ్మోహన్ (రిటైర్డ్), సీనియర్ నావికాదళ అధికారులు, అనుభవజ్ఞులు,నౌకా నిర్మాణ పరిశ్రమ ప్రతినిధులు,పలువురు ఆహ్వానిత అతిథులు హాజరయ్యారు.





Comments
Post a Comment