న్యూఢిల్లీ, జూలై 21: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి దర్యాప్తు, చార్జిషీట్, విచారణ పురోగతిని పర్యవేక్షించే వ్యవస్థపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, 2024-25 నుంచి 2026-27 వరకు బీపీఆర్&డీ నిర్వహించిన 118 శిక్షణా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1,120 మంది పోలీసు సిబ్బందికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందించారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న సీసీటీఎన్‌ఎస్ ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు, దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, విచారణ పురోగతిని పర్యవేక్షిస్తున్నామని, ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలులో ఉందని కేంద్రం వెల్లడించింది. అలాగే ఈ-ఎఫ్‌ఐఆర్ మరియు జీరో ఎఫ్‌ఐఆర్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
ఎస్సీ, ఎస్టీ చట్టం సమర్థవంతమైన అమలుకు రాష్ట్రాలకు కేంద్రం తరచూ మార్గదర్శకాలు జారీ చేస్తోందని, ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు సకాలంలో సహాయం, జిల్లా, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీల సమావేశాల నిర్వహణపై సూచనలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేంద్ర పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని, పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎస్సీ, ఎస్టీ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా కేసుల నమోదు నుంచి విచారణ పూర్తయ్యే వరకు సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు.

Comments
Post a Comment