Skip to main content

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం * గిరిప్రదక్షిణకు భక్తుల భద్రతే లక్ష్యం. * ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు.. క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలన.

.                     K.V.SHARMA EDITOR 
తేదీ: 18 జూలై 2026సింహాచలం: ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు శనివారం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు.

దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, డిప్యూటీ ఇంజనీర్ (ఐ/సి) రామరాజుతో కలిసి అడవివరం జంక్షన్ నుంచి  హనుమంతవాక, చిన్నగదిలి వరకు గిరిప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. 


ఈ సందర్భంగా ఏసీపీ పేడాడ ప్రదీప్తి, గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ సన్యాసినాయుడు, ట్రాఫిక్ సీఐ సురేష్, ద్వారక ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ తదితర పోలీసు అధికారులతో కలిసి భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు ప్రధాన రహదారిపైకి రాకుండా కాలినడక మార్గాలను బారికేడింగ్‌తో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించి భక్తులు నిరాటంకంగా గిరిప్రదక్షిణ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

అడవివరం జంక్షన్ నుంచి హనుమంతవాక వరకు బారికేడింగ్ ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణ, చిన్నగదిలి వరకు నడక మార్గాల భద్రత, అత్యవసర సేవల అందుబాటు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.


అదేవిధంగా, గిరిప్రదక్షిణకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్, స్థానిక నివాసితుల వాహనాల పార్కింగ్, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన చోట్ల అదనపు బారికేడింగ్, దిశా నిర్దేశక బోర్డుల ఏర్పాటు వంటి అంశాలపై పోలీసు, దేవస్థానం అధికారులు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, "గిరిప్రదక్షిణకు విచ్చేసే ప్రతి భక్తుడు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రదక్షిణ పూర్తి చేసేలా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు చేపడుతున్నాం" అని తెలిపారు.

Comments