విశాఖపట్నం, జూలై 7: జ్ఞానాపురంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి) ఆధ్వర్యంలో “భాషా–సాహిత్య వికాసంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) పాత్ర” అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ బహుభాషా సదస్సు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ పి.డి. అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పద్మభూషణ్ ప్రొఫెసర్ వై. లక్ష్మీ ప్రసాద్, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు.
కార్యక్రమం అతిథుల చేతుల మీదుగా సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం ‘షోధ్ సమాలోచన్’ పీర్-రివ్యూడ్ ద్విభాషా అంతర్జాతీయ పరిశోధన జర్నల్ ప్రత్యేక సంచికగా వెలువడిన సదస్సు పరిశోధనా సంచిక, ‘Artificial Intelligence and Digital Transformation in Modern Society’ గ్రంథం, అలాగే 2005 నుంచి నిరంతరంగా వెలువడుతున్న ‘ప్రతిభ’ హిందీ పత్రిక 19వ సంచికను అతిథులు ఆవిష్కరించారు. డాక్టర్ పి.కె. జయలక్ష్మి ప్రత్యేక సంచిక సంపాదకత్వంలో వెలువడిన సదస్సు పరిశోధనా సంచికలో దేశ విదేశాల పరిశోధకుల వ్యాసాలు చోటుచేసుకోగా, ‘Artificial Intelligence and Digital Transformation in Modern Society’ గ్రంథంలో కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు 35 మంది అధ్యాపకుల పరిశోధనా వ్యాసాలు చోటుచేసుకున్నాయి.
ముఖ్య అతిథి ప్రొఫెసర్ వై. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, కృత్రిమ మేధ మానవ సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం కాదని, భాషలు, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించి అభివృద్ధి చేసే శక్తివంతమైన సాధనమని అన్నారు. సాంకేతికతను నైతిక విలువలతో, బాధ్యతాయుతంగా వినియోగించి భాషా వైవిధ్యాన్ని, సాహిత్య సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సమకాలీన అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ, సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.కె. జయలక్ష్మి, భాషా విభాగాల అధ్యాపకులను అభినందిస్తూ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
డాక్టర్ వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల (స్వయంప్రతిపత్తి), విశాఖపట్నం ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ. విజయబాబు గౌరవ అతిథిగా పాల్గొని, భాషలు, సాహిత్య అభివృద్ధికి కృత్రిమ మేధ వినియోగంపై చర్చించేందుకు ఈ సదస్సు చక్కని వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ట్రేస్.ఏఐ, సియాటిల్ (అమెరికా) సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యామిని కె. కీలకోపన్యాసం చేస్తూ భాషా సాంకేతికత, విద్య, పరిశోధన, అనువాదం, సాహిత్య అధ్యయనంలో కృత్రిమ మేధ విస్తృత అవకాశాలను వివరించారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం ప్రొఫెసర్ టి. సత్యనారాయణ భాషా బోధన, అభ్యాసం, పరిశోధనలో కృత్రిమ మేధను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు మానవ సృజనాత్మకతను పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ స్వాగతోపన్యాసం చేస్తూ, ఈ సదస్సు తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, ఆంగ్లం అనే ఐదు భాషల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు యూరప్, అమెరికా తదితర దేశాల నుంచి సాహితీవేత్తలు, మేధావులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారని, 100 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడించారు.
సదస్సు కన్వీనర్, కళాశాల తెలుగు విభాగాధిపతి, పూర్వ ద్వితీయ భాషా విభాగాధిపతి డాక్టర్ పి.కె. జయలక్ష్మి సదస్సు లక్ష్యాలను వివరిస్తూ, భాషా–సాహిత్యాలపై కృత్రిమ మేధ ప్రభావాన్ని విశ్లేషించడం, దాని అవకాశాలు, సవాళ్లపై చర్చించడం, అలాగే కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వినియోగించే దిశగా అవగాహన కల్పించడమే ఈ అంతర్జాతీయ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, విశిష్ట అతిథులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, ఆంగ్ల భాషా విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, దేశ విదేశాల నుంచి విచ్చేసిన ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు సాంకేతిక సమావేశాలు, పరిశోధనా పత్రాల సమర్పణలు, శాస్త్రీయ చర్చలు నిర్వహించబడనున్నాయి.






Comments
Post a Comment