Skip to main content

ప్రజా గ్రంథాలయాలను ఆధునికీకరించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన సమాచార సేవలు *ప్రజా గ్రంథాలయాలు ఆవిష్కరణ, అభ్యాస, సహకార కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలి* *డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆధునికీకరణే లక్ష్యం *ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జాతీయ గ్రంథాలయ మిషన్ సామర్థ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం*

 

                 K.V.SHSRMA EDITOR 
ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 23 : ప్రజా గ్రంథాలయాలు ఇకపై కేవలం పుస్తకాలు చదివే కేంద్రాలుగా కాకుండా ఆవిష్కరణ (Innovation), అభ్యాసం (Learning), వినోదం (Recreation), సహకారం (Collaboration)కు వేదికలుగా రూపుదిద్దుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల డైరెక్టర్ ఏ. కృష్ణ మోహన్ అన్నారు. మారుతున్న సాంకేతిక పరిణామాలు, డిజిటల్ ప్రపంచం అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయ సేవలను విస్తరించి, యువతను తిరిగి గ్రంథాలయాల వైపు ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.


కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ (NML), రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న 56వ సామర్థ్యాభివృద్ధి (Capacity Building) శిక్షణా కార్యక్రమం గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయ మరియు సమాచార శాస్త్ర విభాగంలో ప్రారంభమైంది. జూలై 23 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు కొనసాగే ఈ శిక్షణలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా గ్రంథాలయాల గ్రంథపాలకులు, నిపుణులు పాల్గొంటున్నారు.


ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ. కృష్ణ మోహన్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో ప్రజా గ్రంథాలయాలు కూడా కాలానుగుణంగా మారాలని పేర్కొన్నారు. డిజిటల్ సేవలు, ఈ-రిసోర్సులు, ఆన్‌లైన్ సమాచార వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా గ్రంథాలయాల ప్రాముఖ్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం యువత అధికంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్న నేపథ్యంలో వారిని తిరిగి గ్రంథాలయాలకు తీసుకురావడం కోసం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలు సామాజిక, విద్యా, సాంస్కృతిక అభివృద్ధికి కేంద్ర బిందువులుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల్లో గ్రంథాలయాల ఆధునికీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు సులభంగా సేవలు అందించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

 


రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ప్రాజెక్టు అధికారి దీపాంజన్ ఛటర్జీ మాట్లాడుతూ, దేశంలోని ప్రజా గ్రంథాలయాలను ఆధునికీకరించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన సమాచార సేవలు అందించడమే జాతీయ గ్రంథాలయ మిషన్ ప్రధాన లక్ష్యమన్నారు. ఆధునిక గ్రంథాలయాల ఏర్పాటు, ప్రజా గ్రంథాలయాల సర్వేలు, గ్రంథపాలకులకు సామర్థ్యాభివృద్ధి శిక్షణ, నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అభివృద్ధి అనే నాలుగు ప్రధాన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 69 రాష్ట్ర, జిల్లా ప్రజా గ్రంథాలయాలతో పాటు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐదు ప్రధాన గ్రంథాలయాల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం జిల్లా గ్రంథాలయానికి ఇటీవల రూ.87 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ, సమాచారమంతా ఇంటర్నెట్‌లో లభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు గ్రంథాలయాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు పుస్తక ప్రదర్శనలు, పఠన కార్యక్రమాలు, ప్రజెంటేషన్ పోటీలు, రచనా పోటీలు, అత్యధికంగా గ్రంథాలయాన్ని వినియోగించే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రంథాలయాలు కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకే పరిమితం కాకుండా పరిశోధకులు, ఉపాధ్యాయులు, సాధారణ పాఠకులు, సమాజంలోని అన్ని వర్గాలకు విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు.



కార్యక్రమ సమన్వయకర్త వి. ధనరాజ్ మాట్లాడుతూ, ప్రజా గ్రంథాలయాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలతో పాటు గ్రంథపాలకుల సామర్థ్యాల పెంపు కూడా అత్యంత అవసరమన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా గ్రంథాలయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రజాసేవా దృక్పథం వంటి అంశాల్లో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఆధునిక గ్రంథాలయ నిర్వహణ, డిజిటల్ సేవలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో శిక్షణ పొందడం ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

విభాగ గౌర‌వ ఆచార్యులు  ఆచార్య శ‌శిక‌ళ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజా గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వ కేంద్రాలుగా కాకుండా సమాజానికి విజ్ఞానం, సృజనాత్మకత, ఆవిష్కరణ, పఠన సంస్కృతిని పెంపొందించే సజీవ జ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని  తెలియజేసారు.

ఈ శిక్షణలో భాగంగా ఆధునిక గ్రంథాలయ నిర్వహణ, విశ్వవిద్యాలయ గ్రంథాలయ వ్యవస్థలు, MARC-21 కేటలాగింగ్, సమాచార వనరుల అన్వేషణ, మేధోసంపత్తి హక్కులు (IPR), కాపీరైట్, గూగుల్ సైట్స్ ద్వారా గ్రంథాలయ వెబ్‌సైట్ల రూపకల్పన, డిజిటల్ సేవలు, జ్ఞాన భారత్ మిషన్, పుస్తకాల పరిరక్షణ, రసాయనిక సంరక్షణ, బైండింగ్ తదితర అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు.

సాలార్ జంగ్ మ్యూజియం నిపుణులు పుస్తకాల సంరక్షణ, బైండింగ్‌పై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు.

ఈ ఐదు రోజుల శిక్షణ ద్వారా గ్రంథపాలకులు ఆధునిక గ్రంథాలయ నిర్వహణలో నైపుణ్యాలు పెంపొందించుకుని, ప్రజలకు డిజిటల్, సమాచార సేవలను మరింత సమర్థవంతంగా అందించే అవకాశాలు మెరుగుపడతాయని వక్తలు అభిప్రాయపడ్డారు.

Comments