Skip to main content

జీవీఎంసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కమిటీ సిఫార్సుల అమలుకు చర్యలు* *ఉద్యోగ సంఘాలతో విస్తృతంగా చర్చించి నివేదిక రూపొందించిన ప్రత్యేక కమిటీ* *ఉద్యోగులు, కార్మికుల వినతులను సమగ్రంగా పరిశీలించి సిఫార్సులు* *ఇటీవల పెండింగ్‌లో ఉన్న నియామకాలు, పదోన్నతులు పూర్తి చేసిన జీవీఎంసీ* *జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్*

.                     K.V.SHARMA EDITOR 
 విశాఖపట్నం మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తన నివేదికను సమర్పించిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడం, వారి సమస్యలకు సంస్థాగత పరిష్కారాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కమిటీలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు, విభాగాధిపతులు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్‌తో పాటు సంబంధిత అధికారులు సభ్యులుగా ఉండి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపి, ఉద్యోగులు, కార్మికుల నుంచి అందిన వినతులు, సమస్యలు, సూచనలను సమగ్రంగా పరిశీలించి నివేదికను రూపొందించినట్లు కమిషనర్ వెల్లడించారు.

ప్రత్యేక కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు సంబంధిత విభాగాలకు ఇప్పటికే పంపించినట్లు కమిషనర్ తెలిపారు. సాధ్యమైన మేరకు వాటిని దశలవారీగా అమలు చేస్తూ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఇటీవల జీవీఎంసీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు, ఉద్యోగుల పదోన్నతులను విజయవంతంగా పూర్తి చేశామని, అదే స్ఫూర్తితో ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఇతర న్యాయమైన సమస్యలను కూడా ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు.

జీవీఎంసీ అభివృద్ధిలో ఉద్యోగులు, కార్మికుల పాత్ర ఎంతో కీలకమని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, పారదర్శక పరిపాలన, ఉద్యోగులకు న్యాయం చేయడం జీవీఎంసీ యాజమాన్యం ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతుందని తెలిపారు. ఉద్యోగులు సంతృప్తిగా విధులు నిర్వహించినప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమనే లక్ష్యంతో జీవీఎంసీ ముందుకు సాగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు.

*పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ*

Comments