విశ్వవిద్యాలయ ప్రగతిలో పూర్వవిద్యార్థులు భాగం కావాలి - అస్ట్రేలియా పూర్వవిద్యార్థులతో వీసీ సమావేశం - ఏయూ ప్రగతిని వివరించిన వీసీ రాజశేఖర్ -
K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూలై 18:విశ్వవిద్యాలయ ప్రగతిలో పూర్వ విద్యార్థులు భాగం కావాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఏయూలో చదువుకుని అస్ట్రేలియాలో స్థిరపడిన పలువురు పూర్వ విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఏయూ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించిన విధానం, భారత ఉపరాష్ట్రపతి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన సందర్భం వారికి వివరించారు.
ఏయూ పూర్వ విద్యార్థికి విభిన్న రంగాలలో స్థిరపడి రాణించిన విధానం, అపార అనుభవాలను నేటి తరం విద్యార్థులకు అందించాలని కోరారు. ప్రస్తుత తరం విద్యార్థులకు మార్గదర్శకం అందించే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనిలో భాగం కావాలని కోరారు. పూర్వవిద్యార్థులు తమ మేధస్సు, వృత్తిపరమైన అనుభవనం, నైపుణ్యాలను నేటి తరానికి అందించే బాధ్యతను స్వీకరించాలన్నారు.
విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడానికి ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రయోగశాలలు, సమావేశ మందిరాలు, తరగతిగదులు నిర్మాణం, ఎండోమెంట్ ప్రైజ్‌లు, అవార్డులను నెలకొల్పే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇటీవల ఏయూ చేసుకున్న ప్రతిష్టాత్మక ఎంఓయూలు, నెలకొల్పిన ప్రయోగశాలల విశిష్టతను వారికి వివరించారు. విద్యార్థులకోసం ప్రత్యేకంగా రెండు హాస్టల్స్, మెగా మెస్‌లను నిర్మించనున్నట్లు చెప్పారు.రీసెర్చ్ పార్క్‌ను సైతం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. ఏయూ హెరిటేజ్‌ను సంరక్షించే దిశగా కూడా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏయూ అభివృద్ధికి సహకరిస్తున్న విధానం, జాతీయ స్థాయిలో సాధించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ర్యాంకింగ్ తదితర వివరాలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఆలుమ్ని రిలేషన్స్ డీన్ ఆచార్య పి.శ్యామల, అసోసియేట్ డీన్‌లు ఆచార్య ఎన్.సాల్మన్ బెన్ని, ఏ.నాగ హనుమాన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థులను అనుసంధానం చేస్తూ చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని పూర్వ విద్యార్థులు పలువురు సంతోషం వ్యక్తం చేశారు.



Comments
Post a Comment