భగవాన్ దివ్య సంకల్పానికి మరో చిరస్మరణీయ మైలురాయి – అనంతపురం ప్రాంగణంలో నూతన మహిళా వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం- మహిళా సాధికారతకు, విలువలతో కూడిన విద్యకు శ్రీ సత్యసాయి మరో మహోన్నత కానుక-శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ (SSSIHL) అనంతపురం ప్రాంగణంలో నూతన మహిళా వసతి గృహ నిర్మాణానికి శుభారంభం*
జూలై 16: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో, ఆయన ప్రవచించిన విలువలతో కూడిన సమగ్ర విద్యా సిద్ధాంతానికి ఈ రోజు మరో చారిత్రాత్మక అధ్యాయం జోడించబడింది. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ (SSSIHL) అనంతపురం ప్రాంగణంలో నూతన మహిళా వసతి గృహ నిర్మాణానికి గురువారం శుభారంభం జరిగింది.
ఈ పుణ్య కార్యక్రమాన్ని *శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారు, శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ( శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ అఫ్ హయ్యర్ లెర్నింగ్ ) వైస్ ఛాన్సలర్ డా. బి. రాఘవేంద్ర ప్రసాద్ గారు ప్రారంభించారు.*
ఈ కార్యక్రమంలో దివంగత డా. కిషన్ గధియా కుటుంబ సభ్యులు శ్రీ దనేశ్ గధియా, శ్రీ సంజయ్ గధియా, విద్యాసంస్థ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు మరియు విశిష్ట అతిథులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITORసుమారు 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, దశలవారీగా నిర్మించబడనున్న ఈ ఆధునిక మహిళా వసతి గృహం దాదాపు 1,500 మంది విద్యార్థినులకు వసతి కల్పించనుంది. ఆధునిక సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సద్గుణాల వాతావరణాన్ని పరిరక్షించే విధంగా ఈ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. భగవాన్ వారి దివ్య ఆశయాలకు అనుగుణంగా విలువలతో కూడిన విద్యను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.
1968 జూలైలో మహిళా విద్యకు అంకితభావంతో ప్రారంభమైన అనంతపురం ప్రాంగణం, గత దశాబ్దాలుగా వేలాది మంది యువతులను విద్యలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసం, మానవతా విలువలు, సేవాభావం, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్దుతూ భగవాన్ విద్యా దార్శనికతకు సజీవ నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా విసిటింగ్ అధ్యాపకులు, పరిశోధకులు మరియు అతిథుల కోసం ఆధునీకరించబడిన అతిథి గృహాన్ని కూడా ప్రారంభించారు. విద్యాసంస్థ అభివృద్ధికి ఇది మరో ముఖ్యమైన మౌలిక సదుపాయంగా నిలవనుంది.
నూతన మహిళా వసతి గృహ నిర్మాణం కేవలం ఒక భవన నిర్మాణం మాత్రమే కాదు; మహిళలను సమగ్ర విద్య ద్వారా శక్తివంతులను చేసి, మానవతా విలువలు, సేవాస్ఫూర్తి, ఉత్తమ వ్యక్తిత్వంతో కూడిన భావి తరాలను తీర్చిదిద్దాలనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దృష్టికి ఇది శాశ్వత ప్రతీకగా నిలవనుంది.




Comments
Post a Comment