మున్సిపాలిటీ విద్యుత్ వ్యయం తగ్గించేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రెండు దశల్లో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన: జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్
అమలాపురం, విశాఖ సందేసం.....మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాలు తదితర సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. విద్యుత్ చార్జీల రూపంలో నెలకు సుమారు రూ.11 లక్షలు వ్యయం అవుతున్నందున, ఈ భారాన్ని తగ్గించేందుకు మొత్తం 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. మొదటి దశలో నడిపూడి రా వాటర్ వర్క్స్ వద్ద స్థల పరిమితులను దృష్టిలో ఉంచుకుని 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.4.50 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో 75 శాతం, అంటే సుమారు రూ.3.60 కోట్లను బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకునే ప్రతిపాదనపై కలెక్టర్ సమీక్షించారు. రుణంపై వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, నెలవారీ చెల్లింపులు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించి, మున్సిపాలిటీకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రెండో దశలో ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ ఆస్తులపై మరో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసి మొత్తం 1 మెగావాట్ సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించారు.
మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో గుర్తించిన సుమారు 1,700 చదరపు మీటర్ల రూఫ్‌టాప్ ప్రాంతంలో 516 కిలోవాట్ల వరకు సౌర విద్యుత్ సామర్థ్యం సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. రెండో దశకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి పరిపాలనా అనుమతుల కోసం సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. డీపీఆర్‌లో ప్రాజెక్టు వ్యయం, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం, ఫైనాన్సింగ్ విధానం తదితర అంశాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా మున్సిపాలిటీకి దీర్ఘకాలికంగా విద్యుత్ వ్యయం తగ్గేలా ప్రాజెక్టు ఆర్థిక సాధ్యతను సమగ్రంగా అంచనా వేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ శాఖ, డిస్కం, ఏపీ ఈఆర్‌సీ నిబంధనలు, సాంకేతిక మరియు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా మున్సిపాలిటీపై విద్యుత్ వ్యయ భారాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ భవనాల్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ కె. రాంబాబు, సోలార్ ఆస్ట్రిచ్ సీఈఓ రాజేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎం కె. పృథ్వీరాజ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బి. పవన్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment