Skip to main content

లాంఛనంగా 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభంగర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఉచిత రవాణా సేవలు *ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కలిసి ప్రారంభించిన జేసీ జి. విద్యాధరి*

 


విశాఖపట్నం, ఆగస్టు 11: గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు మాతా-శిశు ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి లాంఛనంగా ప్రారంభించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భాగ‌స్వామ్య‌మై జెండా ఊపి వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాల రేటును తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడం, పేద కుటుంబాలపై రవాణా వ్యయ భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి నవజాత శిశువులను ఇద్దరు సహాయకులతో కలిసి పూర్తిగా ఉచితంగా ఇంటి వద్దకు చేర్చే పోస్ట్‌నేటల్ డ్రాప్‌బ్యాక్ సౌకర్యాన్ని ‘102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాగే హై-రిస్క్ ప్రెగ్నెన్సీ మహిళలు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ఐరన్ సుక్రోజ్ చికిత్సలు, ప్రత్యేక వైద్య పరీక్షలు, రక్త మార్పిడి వంటి అత్యవసర వైద్య అవసరాల కోసం ఆసుపత్రులకు ఉచితంగా తరలించి తిరిగి ఇంటికి చేర్చే సేవలను కూడా ఈ వాహనాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు విశాఖపట్నం జిల్లాకు 16 అత్యాధునిక వాహనాలు కేటాయించార‌ని జేసీ వివ‌రించారు. ప్రస్తుతం జిల్లాలో కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద 9, అగనంపూడి వద్ద 2, విక్టోరియా ఆసుపత్రి వద్ద 5 వాహనాలు అందుబాటులో ఉంచి సేవలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాహనాల్లో రియర్ సీట్ బెల్టులు, ఎయిర్‌బ్యాగ్‌లు, అగ్నిమాపక పరికరాలు, ఎయిర్ కండీషనింగ్, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, హ్యాండ్ శానిటైజర్, టిష్యూ పేపర్లు, డస్ట్‌బిన్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రియల్‌టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో కాల్ సెంటర్‌కు సమాచారం చేరవేసే ఎమర్జెన్సీ అలర్ట్ స్విచ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో తల్లి-శిశు ఆరోగ్యం, శిశు పోషణ, ప్రసవానంతర సంరక్షణకు సంబంధించిన అవగాహన సందేశాలను ప్రసారం చేసే ప్రత్యేక ఆడియో వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని, లబ్ధిదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవర్లకు రుసుములు లేదా టిప్పులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 2025-26 సంవత్సరంలో 24 వాహనాల ద్వారా 9,988 మంది లబ్ధిదారులు సేవలు పొందగా, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3,274 మంది ఈ సేవలను వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పి. జగదీశ్వరరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బి.వి. రమణ, విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. ఉష, డీసీహెచ్ఎస్ డా. నరేంద్ర సింగ్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కో-ఆర్డినేటర్ డా. అప్పారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


..

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...