విశాఖకు బిజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి భారీ ఏర్పాట్లు* *ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్* 17న భోగాపురం విమానాశ్రయంలో జాతీయ అధ్యక్షుడికి ఘన స్వాగతం 18న విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. 945 మండలాల ప్రతినిధుల హాజరు పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్ సహా రాష్ట్ర ప్రగతిపై తీర్మానాలు
విశాఖపట్నం, ఆగస్టు 16:భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నితిన్ నబీన్ తొలిసారిగా విశాఖపట్నం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. 17న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతున్న రోజే రాత్రి 9 గంటలకు నితిన్ నబీన్ విశాఖకు చేరుకోవడం ఆనందకర పరిణామమన్నారు. డాల్ఫిన్ హోటల్‌లో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
18న రాష్ట్ర కార్యవర్గ సమావేశం:
కొత్త రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటైన నేపథ్యంలో 18న విశాఖలోని వి-కన్వెన్షన్ హాల్‌లో విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు మాధవ్ చెప్పారు. రాష్ట్రంలోని 945 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, రాష్ట్ర పదాధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలవారీగా పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రగతి, ఏడు మోర్చాల కార్యక్రమాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రగతిపై రెండు కీలక తీర్మానాలు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి, వచ్చిన పెట్టుబడులపై ఒక తీర్మానం, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై మరో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు మాధవ్ తెలిపారు.
బీజేపీ అఖిల భారత సంఘటన మంత్రి బీఎల్ సంతోష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభారిగా ఉన్న శివప్రకాశ్ తదితర జాతీయ నాయకులు సమావేశానికి హాజరవుతారని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధిని, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్‌ను ప్రజలకు చాటేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలవరం.. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మాధవ్ తెలిపారు. త్వరలో గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరే పరిస్థితి ఏర్పడుతోందని, అనంతరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-1, ఫేజ్-2 ద్వారా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు సాగు, తాగునీటి భద్రత కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. 24.33 టీఎంసీల తాగునీటి లభ్యత కూడా ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
విశాఖ అభివృద్ధికి కొత్త ఊపువిశాఖలో గూగుల్ వంటి భారీ పెట్టుబడులు రావడంతోపాటు డేటా కేబుల్ ప్రాజెక్టులు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటై విశాఖను ప్రధాన కేంద్రంగా మార్చడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని మాధవ్ తెలిపారు. కొత్త రైల్వే లైన్లు, స్టేషన్లు, రైళ్లతో విశాఖ ప్రాధాన్యం మరింత పెరగనుందని చెప్పారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపన్నారు. ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ వంటి భారీ పరిశ్రమలు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు రూ.1.84 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు, బల్క్ డ్రగ్ పార్క్ తదితర ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు.
నితిన్ నబీన్‌కు ఘన స్వాగతంనితిన్ నబీన్‌కు ఘన స్వాగతం పలికేందుకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఎమ్మెల్యే ఈశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మాధవ్ తెలిపారు. తప్పెటగుళ్లు, డప్పులు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాలను విష్ణుకుమార్ రాజు, ఇతర నాయకులు, నగర అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు వెల్లడించారు.
యువతతో జాతీయ అధ్యక్షుడి ముఖాముఖి
18న సాయంత్రం 4 గంటలకు గ్రాండ్ బే హోటల్‌లో 25 ఏళ్లలోపు 250 మంది ఎంపిక చేసిన యువతతో నితిన్ నబీన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాధవ్ తెలిపారు. యువ న్యాయవాదులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు తదితరులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.
కూటమి ప్రభుత్వం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని మాధవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ముందుకు సాగడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అంశంపై చర్చ జరుగుతోందన్నారు.
ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా తీసుకుని సంక్షేమంతోపాటు అభివృద్ధిని వేగవంతం చేస్తామని మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.
బిజెపి శాశన సభ పక్ష నేత పెన్మెత్స విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్యే నడికుడి ఈశ్వర రావు, బి రాష్ట్ర మీడియా ఇంఛార్జి కిలారి దిలీప్, జిల్లా అధ్యక్షుడు పరుశరామ రాజు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్,కె నరశింగరావు,గాదె శ్రీనివాస రావు, బొత్స సురేష్, తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment