గాజువాక:విశాఖ సందేశం వర్తవాహని :ఆగస్టు 9 :మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులు 30 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గాజువాక మండలం మింది జడ్పీ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
వివిధ ప్రాంతాలు, జిల్లాలు, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే తమ హోదాలను, స్థాయిలను పక్కనపెట్టి చిన్ననాటి స్నేహితులను ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు. 30 ఏళ్ల తర్వాత తమ చిన్ననాటి స్నేహితులందరినీ ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాలు, జిల్లాలు, విదేశాల్లో స్థిరపడిన తన చిన్ననాటి స్నేహితులందరూ ఒక్క పిలుపుకే స్పందించి పెద్ద సంఖ్యలో హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ కష్టసుఖాలను పంచుకునేందుకు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.
30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం మరచిపోలేని అనుభూతి అని పూర్వ విద్యార్థులు తెలిపారు. వయసు పెరిగినా తమ మధ్య ఉన్న స్నేహబంధం ఏమాత్రం తగ్గలేదని, చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయని అన్నారు.
కార్యక్రమం ముగింపులో పాల్గొన్న ప్రతి పూర్వ విద్యార్థిని శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం పూర్వ విద్యార్థుల ఆత్మీయ పలకరింపులు, నవ్వులు, సందడితో కళకళలాడింది. కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్న స్పర్శ మసాలా కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు



Comments
Post a Comment