నీటి ఎద్దడి ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన జీవీఎంసీ మంచినీటి సరఫరా. *తెల్లవారుజాము 4 గంటల నుంచే క్షేత్రస్థాయిలో జీవీఎంసీ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ. *ఆరిలోవపై ప్రత్యేక దృష్టి... ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాతో పాటు నాణ్యత తనిఖీలు. *“డయల్-ఏ-ట్యాంకర్”, ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రాధాన్యతతో నీటి సరఫరా. *కైలాసనగర్, శ్రీహరినగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా పరిశీలన... స్థానికుల నుంచి సానుకూల స్పందన. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం, ఆగస్టు 9: నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచే అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజు, తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్, నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ పల్లంరాజు, సంబంధిత కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఆరిలోవపై ప్రత్యేక దృష్టి" ముడసర్లోవ వాటర్ వర్క్స్ నుంచి జీవీఎంసీ, ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి ఆరిలోవతో పాటు అవసరమైన ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆరిలోవలో నీటి సరఫరాను ప్రధాన ఇంజనీర్, నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ తదితరులు పరిశీలించడంతో పాటు ప్రజలకు సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
“డయల్-ఏ-ట్యాంకర్” – ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రాధాన్యత.
జీవీఎంసీ “డయల్-ఏ-ట్యాంకర్” సేవ, ఆన్‌లైన్ ద్వారా ట్యాంకర్లను బుక్ చేసుకున్న ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత ప్రాంతాలకు ట్యాంకర్లను పంపించి నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లతో పాటు అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ నీటి వనరులు, అనుసంధానాల ద్వారా సరఫరాను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు
ఎత్తైన ప్రాంతాల్లోనూ నీటి సరఫరా" అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కైలాసనగర్, శ్రీహరినగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాను పరిశీలించారు. ఎత్తైన ప్రాంతాలైనప్పటికీ తగిన ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతున్నట్లు గుర్తించారని, స్థానికులతో మాట్లాడగా నీటి సరఫరాపై సానుకూల స్పందన వ్యక్తమైనట్లు కమిషనర్ తెలిపారు.
ఆరిలోవ 13వ వార్డుకు TSR నీటిని అనుసంధానం చేసి సరఫరాను మరింత మెరుగుపరిచే ప్రత్యామ్నాయంపై కూడా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
నీటి అవసరమున్న ప్రతి ప్రాంతానికి సకాలంలో నీటిని అందిస్తూ, నీటి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు క్షేత్రస్థాయి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగిస్తూ, వృథాను నివారించి జీవీఎంసీకి సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ,
K.V.SHARMA EDITOR




Comments
Post a Comment