మాస్కోలో 5వ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సమ్మిట్‌లో విశాఖ అభివృద్ధి విజన్‌ను ఆవిష్కరించిన ఎంపీ ఎం. శ్రీభరత్. *జీవీఎంసీ–మాస్కో ప్రభుత్వాల మధ్య సహకార ఒప్పందం... ప్రపంచస్థాయి సాంకేతికతలు, ఉత్తమ విధానాల భాగస్వామ్యానికి నాంది. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం, ఆగస్టు 4:రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన 5వ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సమ్మిట్లో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీభరత్ విశాఖ నగర అభివృద్ధి విజన్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణాభివృద్ధి కార్యక్రమాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ మరియు మాస్కో ప్రభుత్వాల మధ్య మెమోరాండం ఆఫ్ కోఆపరేషన్ (MoC) కుదిరిందని, అనంతరం మాస్కో డిప్యూటీ మేయర్ మరియు రవాణా, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖాధిపతి మక్సిమ్ లిక్సుటోవ్తో సమావేశమై పరస్పరం అభినందనలు తెలియజేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మార్గదర్శకత్వంలో విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మాస్కో ప్రభుత్వంతో కుదిరిన ఈ సహకార ఒప్పందం ద్వారా ప్రపంచస్థాయి సాంకేతికతలు, వినూత్న రవాణా విధానాలు, ఉత్తమ పట్టణాభివృద్ధి నమూనాలను విశాఖకు తీసుకురావడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, సమ్మిట్ సందర్భంగా అంతర్జాతీయ ప్రతినిధులకు జీవీఎంసీ అమలు చేస్తున్న ప్రాజెక్ట్ సారథి (SARTHI) – ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS), eRT రవాణా వ్యవస్థ, సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌ల అభివృద్ధి, ప్రధాన రహదారుల విస్తరణ, డిజిటల్ పౌర సేవలు, సాంకేతిక ఆధారిత తాగునీటి సరఫరా పర్యవేక్షణ, జనన–మరణ ధ్రువీకరణ పత్రాల డిజిటల్ సేవలు, స్మార్ట్ వెండింగ్ జోన్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ తదితర కార్యక్రమాల గురించి వివరించినట్లు తెలిపారు.
మాస్కో ప్రభుత్వంతో కుదిరిన ఈ సహకార ఒప్పందం ద్వారా స్మార్ట్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ (ITS), ఎలక్ట్రిక్ రవాణా, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజిటల్ పరివర్తన రంగాల్లో ప్రపంచస్థాయి అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుందని కమిషనర్ తెలిపారు.
ఈ భాగస్వామ్యం ద్వారా విశాఖలో ఆధునిక పట్టణ రవాణా పరిష్కారాల అమలుకు మరింత ఊతం లభిస్తుందని, అలాగే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) ను ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాస్కో డిప్యూటీ మేయర్ మక్సిమ్ లిక్సుటోవ్ మాట్లాడుతూ, భారతదేశంతో, ముఖ్యంగా విశాఖపట్నంతో ఏర్పడిన ఈ భాగస్వామ్యం ద్వారా విజ్ఞాన మార్పిడి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పారిశ్రామిక సహకారం తదితర రంగాల్లో దీర్ఘకాలిక సహకారం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
గమనిక: ఈ కార్యక్రమానికి సంబంధించిన మాస్కో డిప్యూటీ మేయర్ మక్సిమ్ లిక్సుటోవ్, విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రసంగాల వీడియోలను ఈ పత్రికా ప్రకటనతో పాటు మీడియాకు జతచేయడం జరిగింది.
పౌర సంబంధాల అధికారి
జీవీఎంసీ


Comments
Post a Comment