Skip to main content

తెలుగు సాహిత్య ప్రస్థానంలో స్వర్ణ మైలురాయి — ఘనంగా ‘శ్రీవాణి’ 500వ సంచిక ఆవిష్కరణ- నైతిక విలువలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, తెలుగు భాషా వైభవాన్ని భావితరాలకు అందించడంలో ‘శ్రీవాణి’ అగ్రగామి: ఒడిశా గవర్నర్ డాక్టర్ శ్రీకంభంపాటి హరిబాబు*

 


విజయవాడ, ఆగస్టు 8: నైతిక విలువలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, తెలుగు భాషా వైభవాన్ని భావితరాలకు అందించడంలో ‘శ్రీవాణి’ మాసపత్రిక అగ్రగామిగా నిలుస్తోందని ఒడిశా గవర్నర్  డాక్టర్ కంభంపాటి హరిబాబు  అన్నారు.

విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ‘శ్రీవాణి’ మాసపత్రిక 500వ సంచిక ఆవిష్కరణ, ‘మేరునగరి హిమగిరి కొమరగిరి’ పుస్తకావిష్కరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘శ్రీవాణి’ మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం ఘనంగా జరిగింది.

‘కాలం మారినా… విలువలు మారకూడదు’ అనే సందేశాన్ని ఉద్ఘాటించిన శ్రీ కంభంపాటి హరిబాబు, సమాజ హితాన్ని ఆకాంక్షిస్తూ, భారతీయ విలువలు ప్రతి ఇంటికీ చేరాలనే ఉన్నత లక్ష్యంతో ‘శ్రీవాణి’ మాసపత్రిక వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు ప్రారంభించిన ఆశయాలను ఆయన కుమారులు శ్రీ  కొమరగిరి చంద్రశేఖర్, శ్రీ  కొమరగిరి శ్యామ్ ప్రసాద్ సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని అభినందించారు.


ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, ఏ ఒక్క నెలా అంతరాయం లేకుండా 500 నెలల పాటు నిరంతరాయంగా ‘శ్రీవాణి’ని కొనసాగించడం సాధారణ విషయం కాదని, కొమరగిరి కుటుంబ సభ్యుల అంకితభావం, పట్టుదల, కృషి అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ మాట్లాడుతూ, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రారంభించిన ‘సనాతన సారథి’ లాంటి ఆశయాలతో అదే విలువలు, ఆధ్యాత్మిక సందేశంతో  భగవాన్ సత్యసాయి బాబా సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ‘శ్రీవాణి’ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.  ఆర్థిక, కుటుంబ, ఇతర ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తోడును, ఆశీస్సులను వరంగా భావిస్తూ ‘శ్రీవాణి’ని దశదిశలా విస్తరించడంలో కొమరగిరి కుటుంబ సభ్యులు చూపుతున్న అంకితభావం ఆదర్శనీయమని ఆయన అన్నారు.

అజ్ఞాన చీకట్లను తొలగించి, విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ, ప్రశాంతత, ఆధ్యాత్మికత, ప్రేమ సందేశాలను భావితరాలకు అందిస్తున్న ‘శ్రీవాణి’ని ప్రేమజ్యోతిగా ఆయన అభివర్ణించారు. ఈ మహత్తర సాహిత్య, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అందరూ ఆదరించి భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. భగవదర్పితంగా కొనసాగుతున్న ఈ కృషి ఫలితంగా ‘శ్రీవాణి’ 1000వ సంచిక వేడుకలు కూడా ఇదే విధంగా ఘనంగా జరగాలని, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులు నిండుగా, మెండుగా, దండిగా ఉండాలని శ్రీ రత్నాకర్ ఆకాంక్షించారు.


భారత సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీమ్ కోర్ట్)  విశ్రాంత  చీఫ్ జస్టిస్  జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా వ్యతిరేక విధానాల నిరోధం, సమాజ హితం కోసం స్వర్గీయ శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు చేసిన త్యాగాలు, ఆయన నమ్మిన సిద్ధాంతాల పట్ల చూపిన నిబద్ధత భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్న కృష్ణమోహనరావు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరోధించడంతో పాటు తెలుగు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని పట్టుబట్టి, ఉన్నత ఆశయాలతో మచిలీపట్నంలో బాలాజీ విద్యాలయం స్థాపించడంలో కీలక పాత్ర పోషించారని జస్టిస్ ఎన్.వి. రమణ గుర్తుచేశారు. 


రాష్ట్ర గనులు, భూగర్భవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో కూడా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య విలువలను ప్రతిబింబిస్తూ మచిలీపట్నం నుంచి ‘శ్రీవాణి’ 500 సంచికల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పేద విద్యార్థులను దత్తత తీసుకుని వారికి ఉత్తమ విద్యను అందించడంలో బాలాజీ విద్యాలయం నిర్వాహకులు శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ చేస్తున్న సేవా, దాతృత్వ కార్యక్రమాలను ఆయన అభినందించారు.

విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాద్ (చిన్ని) మాట్లాడుతూ, సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తూ, ప్రజలను చైతన్యవంతులను చేసి జీవితాలను మారుస్తున్న ‘శ్రీవాణి’ వంటి విలువలతో కూడిన పత్రికలు నేటి ఇంటర్నెట్ యుగంలో ఎంతో అవసరమని అన్నారు. విజయవాడ కు రెండేళ్ల క్రితం భారీ వరదలు వచ్చినప్పుడు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు శ్రీ ఆర్ జె రత్నాకర్ గారి సూచనలమేరకు  6000 మందికి పైగా  చేసిన సేవా కార్యక్రమాలను ఎప్పటికీ మరువలేమని కొనియాడారు.  ఇటువంటి మంచి పత్రికలను పోషించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని, ‘శ్రీవాణి’ ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.


ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ, ‘శ్రీవాణి’ భరతజాతి గుండె చప్పుడు అని అభివర్ణించారు. పత్రికలోని ప్రతి అక్షరం ఒక మంత్రంలాంటిదని, అందరూ దానిని ఆస్వాదించి, ఆకళింపు చేసుకుని, ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకల నారాయణ మాట్లాడుతూ, జై ఆంధ్ర ఉద్యమం నాటి నుంచి నేటి వరకు కొమరగిరి కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ‘శ్రీవాణి’ 500వ సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తన తండ్రి గణపతితో కలిసి కృష్ణమోహనరావు ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఘట్టాలను ఎప్పటికీ మరువలేమని, 19 నెలల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నప్పటికీ ఎంతో ఆత్మీయతతో, ఆధ్యాత్మిక దృక్పథంతో మెలిగారని ఆయన గుర్తుచేశారు. ధైర్యం, పట్టుదలను ఆస్తులుగా చేసుకుని కృష్ణమోహనరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న శ్రీ శ్యామ్ ప్రసాద్, శ్రీ చంద్రశేఖర్ కృషిని ఆయన ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల ప్రత్యేక సంచిక భావితరాలకు దేశభక్తిని బోధించే విజ్ఞాన జ్యోతిగా వెలుగొందుతుందని అన్నారు.

తమ కుటుంబాల్లో దేశభక్తుల పేర్లను పెట్టుకోవడం వెనుక తమ తండ్రుల దేశభక్తి, దేశ సేవా స్ఫూర్తి ఉన్నాయని, ఆ విలువలను ఎప్పటికీ మరువలేమని ఆయన అన్నారు.

కొప్పవరం కళాపీఠం వ్యవస్థాపకులు, వరిష్ట పాత్రికేయులు శ్రీ మా శర్మ మాట్లాడుతూ, ఉన్నత ఆశయాలతో ప్రారంభమైన ‘శ్రీవాణి’ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి, దాని సాహిత్య, సాంస్కృతిక ప్రస్థానానికి అండగా నిలవాలని కోరారు.

*ఘనంగా ఆవిష్కరణలు*

ఈ సందర్భంగా ‘శ్రీవాణి’ 500వ సంచికను భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఆవిష్కరించారు.

‘మేరునగరి హిమగిరి కొమరగిరి’ పుస్తకాన్ని ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించగా, ‘శ్రీవాణి పంచ శత సంచిక గీతామాలిక’ సీడీని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ ఆవిష్కరించారు.

కార్యక్రమానికి ముందు ‘శ్రీవాణి’ సాహిత్య ప్రస్థానంపై రూపొందించిన వీడియో, అలాగే స్వర్గీయ శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు జీవన సాఫల్య ప్రస్థానంపై రూపొందించిన లఘుచిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

‘మేరునగరి హిమగిరి కొమరగిరి’ పేరుతో కృష్ణమోహనరావు జీవన ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, ఛాయాచిత్రాలతో ఏర్పాటు చేసిన చిత్రమాలిక సందర్శకులను విశేషంగా అలరించింది.

ఈ సందర్భంగా ‘శ్రీవాణి’ రచయితలను జ్ఞాపికలతో సత్కరించి, ‘శ్రీవాణి’ సాహిత్యాన్ని అందించారు.

కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు శ్రీ  Ch. సురేంద్ర, రచయితలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల పదాధికారులు, కొమరగిరి కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...