కోట ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి* *– తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్*
K.V.SHARMA EDITOR
తిరుపతి, ఆగస్టు 10: తిరుపతి పార్లమెంటు పరిధి, నెల్లూరు జిల్లా కోటలోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఆ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి లేఖ రాశారు. గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు.
ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తూ ఎంతోకాలంగా సేవలందిస్తున్న గురుకుల పాఠశాలను ఉన్నట్టుండి మూసివేయడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే అందుకోసం ఇప్పటికే కొనసాగుతున్న ఎస్సీ గురుకుల పాఠశాలను మూసివేయడం సరైన విధానం కాదని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.
గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగిస్తూ, అవసరమైతే అదే ప్రాంతంలో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎస్సీ విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోట ఎస్సీ గురుకుల పాఠశాలను కొనసాగించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Comments
Post a Comment