కమర్షియల్ సోలార్ వినియోగదారులపై టీఓడీ భారం ఆంధ్ర ప్రదేశ్ సోలార్ ఇంటెగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి విశ్వప్రసాద్
విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని కమర్షియల్ సోలార్ వినియోగదారులపై టీఓడీ (టైం అఫ్ డే) టారిఫ్ విధానాన్ని వర్తింపజేయడం వల్ల వారు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆంధ్ర ప్రదేశ్ సోలార్ ఇంటెగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి విశ్వప్రసాద్ తెలిపారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని , సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు (పీక్ హవర్స్ ) సోలార్ ఉత్పత్తి ఉండదన్నారు. వ్యాపారులు ఈ సమయంలో గ్రిడ్ విద్యుత్‌ను వాడాల్సి వస్తుందని, దీనికి ప్రభుత్వం భారీగా టీఓడీ ఛార్జీలు వసూలు చేస్తోందన్నారు. పగలు ఉత్పత్తి అయ్యే సౌరశక్తి మిగులుకు గ్రిడ్‌కు ఇచ్చే విద్యుత్ విలువ తక్కువగా ఉండి, రాత్రి వేళల్లో వారు గ్రిడ్ నుండి తీసుకునే విద్యుత్ విలువ (టీఓడీ ఛార్జీల వల్ల) ఎక్కువగా ఉంటుందని, దీనివలన టీఓడీ బిల్లింగ్ విధానంలో పీక్ హవర్స్ లో సర్దుబాటు జరగకపోవటం వలన నెట్ మీటరింగ్ సదుపాయం ఉన్నప్పటికీ బిల్లులు ఆశించినంతగా తగ్గవన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కమర్షియల్ సోలార్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలే ప్రధాన కారణమన్నారు. ఏపీ విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం కమర్షియల్ కేటగిరీకి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పీక్ అవర్స్‌గా పరిగణిస్తారని,ఈ 4 గంటల సమయంలో కమర్షియల్ వినియోగదారులు వాడే విద్యుత్‌పై సాధారణ రేటు కంటే యూనిట్‌కు 1.00 నుండి 2.00 వరకు అదనపు టీఓడీ (టీఓడీ) పెనాల్టీ ఛార్జ్ పడుతోందన్నారు.ఈ సమయంలో సోలార్ ఉత్పత్తి సున్నా కాబట్టి, వారు పూర్తిగా గ్రిడ్ విద్యుత్‌పైనే ఆధారపడి భారీ బిల్లులు కట్టాల్సి వస్తోందని విశ్వ ప్రసాద్ తెలిపారు.విద్యుత్ ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం ప్రతిష్ట్మాత్మకంగా అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా సౌరశక్తికి పెద్దపీటవేసిందని, రాష్ట్ర ప్రభుత్వం దానిని గౌరవించేవిధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కమర్షియల్ సోలార్ వినియోగదారులకు ToD నుండి మినహాయింపు ఇచ్చి, ఏ బిల్లింగ్ సైకిల్ లో ఉత్పత్తి అయిన సోలార్ యూనిట్లు అదే బిల్లింగ్ సైకిల్ లో సర్దుబాటు చేస్తే సమస్య పరిస్కారమవుతుందని అనేక మంది నిపుణులు చెబుతున్నారన్నారు.పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా జీరో విద్యుత్ బిల్లులు వస్తాయని ప్రకటనలు ఇస్తున్నారని వాస్తవానికి విద్యుత్ నియంత్రణ మండలి అమలు చేస్తున్న నిబంధనలతో విద్యుత్ బిల్లు తగ్గాక పోగా ఎక్కువ బిల్లు వస్తున్నాయన్నారు. నెట్ మీటర్ ఏర్పాటులో జాప్యం, డిస్కం బిల్లింగ్ లోపాలు, తప్పుగా లెక్కించడం, సోలార్ సామర్థ్యం సరిపోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.ఈ విషయంపై అవగాహన లేని వినియోగదారులు విక్రేతదారులను (వెండర్) లను తప్పుపడుతున్నారన్నారు. త్వరలోనే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి తమ సమస్యలను వివరిస్తామని తెలిపారు. సోలార్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ సౌరశక్తి రంగానికి తగిన న్యాయం చెయ్యాలని విశ్వప్రసాద్ కోరారు.


Comments
Post a Comment