రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు, ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్. ఈశ్వరరావు మరియు ఆడారి ఆనంద్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ హాజరై, పార్టీ ఆశావాహులు, నాయకులతో సమావేశమై రాబోయే ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ:
కూటమి విజయాలు - బిజెపి సత్తా: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇవని, ఇందులో బిజెపి తన సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయి బలోపేతం: విశాఖ జిల్లాలో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య భారీగా ఉందని, టికెట్ ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ వార్డు/బూత్ స్థాయి వరకు వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర పథకాల ప్రచారం: ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచనలతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం: స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజలకు అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర కార్యదర్శులు కే. సురేంద్రమోహన్, ఉమ్మడి సుజాత, రాష్ట్ర కోశాధికారి ఎం. నాగేంద్ర, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్, విశాఖ జిల్లా ఇన్చార్జ్ రెడ్డి పావనితో పాటు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




Comments
Post a Comment