జార్ఖండ్‌లో విద్యార్థులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం…. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన మాధవ్ .. - ఏపీ బీజేపీ చీఫ్ పీవీయన్ మాధవ్
విశాఖపట్నం: విశాఖ సందేశం వర్తవాహని: జార్ఖండ్ రాజధాని రాంచీలో తమ ఉపాధి,ఉద్యోగాలు, భవిష్యత్తు, హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తీవ్రంగా ఖండించారు .
విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో పీవీయన్ మాధవ్ మాట్లాడుతూ..విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్–జేఎంఎం ప్రభుత్వం అందుకు బదులుగా వారిపై లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ క్యానన్లు ఉపయోగించడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కుల కోసం నిరసన చేస్తున్న విద్యార్థులను అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పీవీఎన్ మాధవ్ అన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై ప్రశ్నిస్తే వారిని శత్రువులుగా చూడటం కాంగ్రెస్–జేఎంఎం ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమన్నారు. మహిళా విద్యార్థుల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని మాధవ్ డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జార్ఖండ్ విద్యార్థుల ఆవేదన ఎందుకు కనిపించడం లేదని పీవీఎన్ మాధవ్ సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగే ప్రతి నిరసనపై స్పందించే రాహుల్ గాంధీ, కాంగ్రెస్–జేఎంఎం ప్రభుత్వం అధికారంలో ఉన్న జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.
విద్యార్థుల భవిష్యత్తు కంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పోలీసులు విద్యార్థులపై చర్యలు తీసుకుంటే ఒక విధంగా, ఇతర రాష్ట్రాల్లో జరిగితే మరో విధంగా స్పందించడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి కాదా అని అన్నారు. విద్యార్థులకు మద్దతు ఇవ్వడంలో కూడా ‘పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియెన్స్’ ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ నిజంగా విద్యార్థుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉంటే జార్ఖండ్‌కు వెళ్లి విద్యార్థులను పరామర్శించి, వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని పీవీఎన్ మాధవ్ అన్నారు.
గత కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో గందరగోళం సృష్టించడమే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా మారిందని పీవీఎన్ మాధవ్ విమర్శించారు. మొదట ఒక డిమాండ్, ఆ తర్వాత మరో డిమాండ్, ఇప్పుడు ఇంకో అంశాన్ని తెరపైకి తీసుకురావడం చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రతిరోజూ తన ‘గోల్‌పోస్ట్’ ఎందుకు మారుస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ సభను సజావుగా నడవనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి సభలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ చర్చ నుంచి ఎందుకు వెనక్కి వెళ్తోందని నిలదీశారు.
“చర్చకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం.. చర్చకు సిద్ధంగా లేని ప్రతిపక్షం” అన్న పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోందని పీవీఎన్ మాధవ్ విమర్శించారు. పార్లమెంట్ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదిక అని, రాజకీయ గందరగోళానికి వేదిక కాదని అన్నారు.
ఆగస్టు 10న నిర్వహించిన విలేకరుల సమావేశంలో జంతర్ మంతర్ ఘటనకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పీవీఎన్ మాధవ్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద బుల్లెట్లు పేల్చినట్లు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్ధి కోసం నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం, వాటి ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి లక్షణం కాదని అన్నారు. “రాహుల్ గాంధీ గారూ.. ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపించండి” అని పీవీఎన్ మాధవ్ సవాల్ చేశారు.
రాహుల్ గాంధీ పారిపోవద్దని, చర్చకు భయపడవద్దని పీవీఎన్ మాధవ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్‌లో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను సజావుగా నడవనివ్వాలని కోరారు.
చర్చ జరగాలని, వాస్తవాలు దేశ ప్రజల ముందుకు రావాలని అన్నారు. రాహుల్ గాంధీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని పార్లమెంట్‌లో పెట్టాలని, వాటిపై ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు.
బీజేపీ డిమాండ్ల
జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై అనవసరంగా కేసులు నమోదు చేసి ఉంటే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై కాంగ్రెస్–జేఎంఎం ప్రభుత్వం వెంటనే చర్చించి పరిష్కారం చూపాలని కోరారు.
విద్యార్థులపై అధిక బలప్రయోగానికి బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా విద్యార్థులు చేసిన ఆరోపణలపై ప్రత్యేకంగా విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు.
భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ విద్యార్థులు, యువతకు అండగా నిలుస్తుందని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు రాజకీయాలకు బలికావడానికి వీల్లేదని అన్నారు. విద్యార్థుల హక్కులు, ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే ప్రతి విద్యార్థికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ వైఖరిని విడనాడి విద్యార్థుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా పరిష్కరించేందుకు ముందుకు రావాలని పీవీఎన్ మాధవ్ కోరారు .
“రాహుల్ గాంధీ గారూ.. పారిపోవద్దు.. చర్చకు భయపడవద్దు.. పార్లమెంట్‌ను పనిచేయనివ్వండి.. దేశానికి సమాధానం చెప్పండి” అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు.

Comments
Post a Comment