విద్యార్థులే వర్సిటీకి వెన్నెముక వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ ఏయూలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆంధ్రవిశ్వవిద్యాలయం,ఆగస్టు15:విద్యార్థులే వర్సిటీకి వెన్నెముకని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వవిద్యాలయంలోని క్రీడా మైదానంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కెరీర్ ప్లానింగ్, డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్లు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత దేశం సాంకేతికతపై ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వయం సంవృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి యువత మేధస్సు, ఆవిష్కరణలు కీలకంగా నిలుస్తాయన్నారు.ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దీని ద్వారాసౌత్ క్యాంపస్‌లో 1,200 మంది సామర్థ్యంతో బాలికల హాస్టల్, నార్త్ క్యాంపస్‌లో 1,300 మంది సామర్థ్యంతో బాలుర హాస్టల్, 2,500 మంది సామర్థ్యంతో మెగా మెస్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భవనాల డిజైన్లు దాదాపు పూర్తయ్యాయని, రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణలు, పారిశ్రామిక ఆలోచనలను ప్రోత్సహించేందుకు స్టూడెంట్ స్టార్టప్ గ్రాంట్లు ప్రారంభించామని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకుని గ్రాంట్లకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.బోధన, పరిశోధన రంగాలలో జరుగుతున్న ప్రగతి, ఏయూ సాధిస్తున్న అభివృద్ధిని వివరించారు. ఏయూలో పలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు నెలకొల్పుతున్నామన్నారు. శతాబ్ది ఉత్సవాల విజయానికి విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, పాలక మండలి సభ్యులు అందించిన సహకారానికి వీసీ కృతజ్ఞతలు తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.అధ్యాపకుల అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న యూజీసీ బకాయిల అంశంలో ఇటీవల కొంత ఉపశమనం లభించిందని, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. శతాబ్ది గ్రాంట్‌కు సంబంధించిన డీపీఆర్ సిద్ధమవుతోందని అది ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వీసీ విశ్వాసం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. వారు విభిన్న రూపాలలో వర్సిటీకి తమ సహకారాన్ని అందిస్తున్నారన్నారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అకట్టుకున్నాయి. విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి అవార్డులను, స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.
కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్, పాలక మండలి సభ్యులు, ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










Comments
Post a Comment