శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. * దివ్య క్షేత్ర అభివృద్ధికి సహకరించాలి * ఆక్రమిత ఇళ్లను ఖాళీ చేసి దేవస్థానం అభివృద్ధికి సహకరించాలి: ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు.
సింహాచలం 13-08-2026 శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్ర అభివృద్ధిలో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను అనుసరించి భక్తులకు మరింత మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దేవస్థానం చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో దక్షిణ రాజగోపురం నుండి స్వామివారి నిత్య అన్నప్రసాదం భవనం వరకు ఉన్న ఆక్రమిత ఇళ్లను ఖాళీ చేయించే అంశంపై గురువారం కొండపైన పీఏసీ బిల్డింగ్‌లో సంబంధిత ఆక్రమణదారులతో దేవస్థానం అధికారులు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు, ఎస్‌డీసీ మధులత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, ఇన్‌చార్జ్ డిప్యూటీ ఇంజనీర్ రామరాజు, ఏఈఓ వాడ్రేవు రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు, గడి అప్పలనాయుడు, పర్యవేక్షణ అధికారి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, సింహాచలం దివ్య క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆక్రమిత ఇళ్లను ఖాళీ చేసి దిగువ ప్రాంతానికి తరలివచ్చి దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
గతంలో నిర్వహించిన ఎన్యుమరేషన్ ప్రకారం అర్హత కలిగిన వారికి నిబంధనల మేరకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ స్థలాల కేటాయింపు ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈవో స్పష్టం చేశారు.
ఈ అంశాన్ని అందరూ సామరస్యపూర్వకంగా చర్చించుకుని, దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యాలు, క్షేత్ర పవిత్రత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈవో కోరారు.
సమావేశంలో పాల్గొన్న ఆక్రమణదారులు కూడా విషయాన్ని పరస్పరం చర్చించుకుని తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని అధికారులకు తెలిపారు. అధికారులు, స్థానికులు పరస్పర అవగాహనతో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు సమావేశం వేదికగా చర్చించారు.





Comments
Post a Comment