శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. అనావృష్టి నివారణకు శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో రెండవ రోజు వైభవంగా కొనసాగిన వరుణ జప యాగం.
దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో జల్లెపల్లి వెంకటరావు పర్యవేక్షణలో లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలో సుభిక్షం నెలకొనాలనే సంకల్పంతో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మూడు రోజుల వరుణ జప యాగం రెండవ రోజు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగింది.
ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీ కె. తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలో ఉదయం గణపతి పూజ, పునఃపూజ, బలి పూజ, బలి హోమం, వరుణ జపం, వేదపారాయణం, నిత్యహోమం, పంచవింశతి (25) కలశాల స్థాపన, ప్రత్యేక ఆరాధన, నివేదన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
సాయంత్రం పంచవింశతి కలశాల ఆవాహన, వేదపారాయణం, నిత్యహోమం, నిత్య బలిహరణ తదితర వైదిక కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ వరుణ జప యాగం ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులు, పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.




Comments
Post a Comment