కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలి. *వార్డుల డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి. *పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలి... ఒక్క ఓటరు కూడా మినహాయింపు కాకుండా, పేర్లు పునరావృతం కాకుండా పక్కాగా పరిశీలించాలి. *రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రానున్న జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసి, పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్ రావు, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలు, మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అనుగుణంగా జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియకు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా జీవీఎంసీ వార్డుల విస్తరణ, డీలిమిటేషన్‌కు సంబంధించి అందుతున్న అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల మేరకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని చీఫ్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
అన్ని జోన్లలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారనే వివరాలను పక్కాగా నమోదు చేయాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఓటర్ల జాబితాల్లో ఒక్క ఓటరు పేరు కూడా మినహాయింపు కాకుండా, ఏ ఒక్కరి పేరు పునరావృతం కాకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఈ ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది, ఎన్నికల సామగ్రి నిర్వహణపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు, కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వెలుతురు, మరుగుదొడ్లు, ర్యాంపులు, పారిశుధ్యం వంటి కనీస సదుపాయాలు ఉండేలా పరిశీలించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు అనుకూలంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా ప్రణాళిక చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి జోన్‌లో ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, చేపట్టాల్సిన పనులు, బాధ్యత వహించే అధికారులు, పూర్తి చేయాల్సిన గడువులను నిర్దేశిస్తూ పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ అదనపు కమిషనర్ డివి రమణమూర్తికి ఆదేశించారు.


Comments
Post a Comment