▪️ *రూ.10 కోట్లతో అల్లూరి సీతారామరాజు పార్క్ ప్రారంభించిన మంత్రి నారాయణ, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా* ▪️ *గాజువాక కాలుష్యం పై పల్లా ఉక్కుపాదం* ▪️ *డంపింగ్ యార్డ్ రహిత గాజువాక దిశగా అడుగులు* *- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*
విశాఖపట్నం, మార్చి 17 :* గాజువాకలో మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ పర్యటన సందర్బంగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 76వ వార్డు ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.10 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు పార్కును ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు, గాజువాకలో కాలుష్య సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గాజువాకను పూర్తిగా డంపింగ్ యార్డ్ రహిత ప్రాంతంగా మార్చి ‘పాల్యూషన్ ఫ్రీ గాజువాక’గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. మంత్రి పి. నారాయణ గారి పనితీరును పల్లా ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ వ్యవస్థను పునరుద్ధరించి, నగరాభివృద్ధికి వేగం తీసుకొస్తున్న మంత్రి నారాయణ గారి కృషి అభినందనీయమన్నారు. తాగునీరు, డ్రైనేజీ, మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన చూపుతున్న చొరవ వల్లే నగరాలు కొత్త రూపం దాలుస్తున్నాయని కొనియాడారు. గాజువాక అభివృద్ధికి కూడా మంత్రి నారాయణ గారి ప్రత్యేక దృష్టి ఉండటం స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పల్లా తెలిపారు.
*కాలుష్యంపై కఠిన చర్యలు*
గాజువాక, అగనంపూడి, పెందుర్తి ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 450 టన్నుల ఘన వ్యర్థాలు డంపింగ్ యార్డ్‌కు చేరుతున్నాయని పల్లా తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆధునిక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కంపాక్టర్లు ఏర్పాటు చేసి, ఒక్కో కంపాక్టర్ ద్వారా సుమారు 33 టన్నుల వ్యర్థాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు ఏర్పాటు చేసి చెత్త నిల్వ లేకుండా వెంటనే తరలించే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. “డంపింగ్ యార్డ్ లేకుండా గాజువాకను తీర్చిదిద్దుతాం” అని పల్లా స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న 8 ఎంఎస్ కంటైనర్లను 30కి పెంచి, చెత్త నిల్వ లేకుండా నిరంతరంగా తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 76వ వార్డు రామచంద్రనగర్ డంపింగ్ యార్డ్‌ను సందర్శించి స్థానికులతో మాట్లాడిన పల్లా, సమస్యను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
*కూటమి ప్రభుత్వ అభివృద్ధి దిశ*
రాష్ట్రాన్ని ‘మిషన్ వరల్డ్’గా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పల్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కోసం రూ.15 వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నామని, డ్రైనేజీ పనులకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.4 వేల కోట్లు కేటాయించి మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. గాజువాకలోనే రూ.223 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 74వ వార్డు దయాల్ నగర్ కొండను హిల్ టాప్ పార్క్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
*మున్సిపల్ నిధుల వినియోగంలో పారదర్శకత*
గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ నిధులను దారి మళ్లించి అభివృద్ధిని అడ్డుకుందని పల్లా విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి ప్రతి మున్సిపాలిటీ నిధులను అదే మున్సిపాలిటీలో ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు చెల్లించిన పన్నులు ప్రజల అభివృద్ధికే వినియోగించేలా గ్రీన్ ఛానల్ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, పక్కా డ్రైనేజీ వ్యవస్థలు, వీధి దీపాలు, మెరుగైన రహదారులు కల్పించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని పల్లా తెలిపారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కూడా కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments
Post a Comment