శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – ఆంధ్రప్రదేశ్ తేదీ: 20 మార్చి 2026 ప్రశాంతి నిలయంలో భక్తి తరంగాలు – “సాయి ప్రేమ తరంగిణి”తో భక్తులను మంత్రముగ్ధులను చేసిన ఆంధ్రప్రదేశ్ మహిళా యువత
అనంతరం రాష్ట్ర మహిళా యువజన సమన్వయకర్త శ్రీమతి సాయి కుమారి గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. సేవ ద్వారా కేవలం బాహ్య సహాయం మాత్రమే కాకుండా, అంతర్గత పరివర్తన, విలువలు, జీవన పాఠాలు పొందగలమని ఆమె పేర్కొన్నారు. నిస్వార్థ సేవ ఆధ్యాత్మిక వికాసానికి మార్గమని ఆమె భావోద్వేగంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది “సాయి ప్రేమ తరంగిణి” అనే భక్తి గాన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా యువత సమర్పించిన ఈ సంగీత కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. వివిధ భారతీయ భాషల్లో పది భక్తి గీతాలను మాధుర్యభరితంగా ఆలపించి, ఏకత్వంలో వైవిధ్యం అనే భావాన్ని ప్రతిబింబించారు. ప్రతి గానం భక్తి, ప్రేమ, సమర్పణతో నిండి, ఆ వాతావరణాన్ని దివ్యానుభూతిగా మలిచింది.
ఈ పవిత్ర సందర్భంలో శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారు, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, “సాధన నుండి ఆరాధన” అనే దివ్య గ్రంథాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ యువతను ఉద్దేశించి ప్రసంగించి, వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం అందిస్తూ ప్రేరణనిచ్చారు.
ఈ గ్రంథంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రసాదించిన దివ్య ఆజ్ఞలు మరియు మార్గదర్శకాలు పొందుపరచబడి ఉన్నాయి. వీటిని భక్తులు మార్చి 25 నుండి ఏప్రిల్ 24 వరకు ఆచరించడం ద్వారా తమలో ఆత్మపరివర్తన సాధించవచ్చు. ఈ కాలం ప్రేమ, కరుణ, సహనం, ఐక్యత వంటి దివ్య గుణాలను ఆచరించే పవిత్ర సమయం. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస వంటి విలువలను జీవితంలో ఆచరిస్తూ, ప్రతి జీవిలో దైవాన్ని దర్శించే స్థితికి చేరుకోవడం ఈ సాధన యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ కార్యక్రమంలో శ్రీ ఐ.ఎస్.ఎన్. ప్రసాద్ గారు (ట్రస్టీ), శ్రీ ఎస్. కోటేశ్వరరావు గారు (నేషనల్ సర్వీస్ వింగ్ కోఆర్డినేటర్), శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు (రాష్ట్ర అధ్యక్షులు), శ్రీ చి. సురేంద్ర గారు (రాష్ట్ర ఉపాధ్యక్షులు), శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు (రాష్ట్ర అధ్యక్షులు, కర్ణాటక – సౌత్) తదితరులు పాల్గొన్నారు.
భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని భక్తి, ఆనందోత్సాహాలతో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం భగవాన్ బాబా వారి “అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు” అనే శాశ్వత సందేశాన్ని సజీవంగా ప్రతిబింబించింది.
పర్తి యాత్ర ఘన ముగింపు*ఆంధ్రప్రదేశ్ యువత మూడు రోజుల పర్తి యాత్ర ప్రశాంతి నిలయంలో భక్తి, ఆధ్యాత్మికత నిండిన వాతావరణంలో ఘనంగా ముగిసింది.చివరి రోజు కార్యక్రమం వేద పారాయణంతో ప్రారంభమై, ఆ పరిసరాలను దివ్యస్పందనలతో నింపింది. అనంతరం *“యువ స్పూర్తి – సాయి అనుగ్రహ దీప్తి”* అనే నాటిక ప్రదర్శించబడింది. యువతలో ఆత్మవిశ్వాసం, భక్తి, సేవా భావం మరియు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ మహిమను అద్భుతంగా ప్రతిబింబించిన ఈ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది
తదుపరి భజనలతో భక్తులు ఆనందభరితంగా మునిగిపోయి, చివరగా మంగళహారతితో కార్యక్రమం ముగిసింది.ఈ పర్తి యాత్ర మొత్తం యువతకు నిస్వార్థ సేవ, భక్తి, ఆత్మపరివర్తన మార్గాన్ని గుర్తుచేస్తూ, భగవాన్ బాబా వారి “అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు” అనే సందేశాన్ని జీవితంలో ఆచరించేందుకు ప్రేరణనిచ్చింది.

Comments
Post a Comment