పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ కీలకం* * జూన్ నాటికి 2.60 లక్షల గృహాల పూర్తి లక్ష్యం * విశాఖ మెట్రో సాంకేతిక ప్రక్రియలు త్వరలో పూర్తి -మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తికి చర్యలు * విలేకరులతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ
గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఆలస్యం జరిగినప్పటికీ, వాటిని పూర్తి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో సుమారు 20 వేలకుపైగా గృహాలు నిర్మాణ దశలోనే నిలిచిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ గృహ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే వేలాది ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, జూన్ నెలాఖరు నాటికి సుమారు 2.60 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో 90కు పైగా మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఆస్తుల వినియోగం, ఆదాయ వనరుల విస్తరణ వంటి మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు జాయింట్ కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించామని చెప్పారు.
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై “రైడర్స్” సంస్థ అధ్యయనం చేస్తోందని, రెండు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం పనులను వేగవంతంగా చేపట్టి మెట్రో ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ తరహాలో విశాఖపట్నానికి సెమీ రింగ్ రోడ్ అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు ఈ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఒక రహదారి నిర్మాణానికి అటవీ భూమి అడ్డంకిగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వం సెంటు భూమి కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందన్నారు. అయితే విచారణ కారణంగా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.

Comments
Post a Comment