అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు* * ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహణ * భాగస్వామ్యమైన ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఇతర ప్రముఖులు * మహిళా సాధికారతకు ప్రభుత్వాల కట్టుబడి ఉన్నాయన్న గంటా, విష్ణుకుమార్ రాజు * ఉత్తమ ప్రతిభ చూపిన 59 మంది మహిళా అధికారులకు, సిబ్బందికి అవార్డులు అందజేత
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా సాధికారత ఒక్కరోజుతో ముగిసే కార్యక్రమం కాదని, సమాజం మొత్తం దీనిని అర్థం చేసుకుని మహిళలకు మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి నిర్ణయాలతో మహిళలకు విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా అదే దిశగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని, “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి” వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ఆనందపురం మండలం గిడిజాల వద్ద మహిళల కోసం 50 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు.
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా ఇప్పటివరకు సుమారు 50 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని చెప్పారు. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, రానున్న నాలుగేళ్లలో నగరం మరింత అభివృద్ధి సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆన్‌లైన్ మోసాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ మహిళా సాధికారత నిజమవుతున్న సమయం ఇదని అన్నారు. కార్యక్రమానికి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించగా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబంగా కనిపించాయన్నారు. మహిళల శక్తి అపారమని, ప్రతి రంగంలో కనీసం 50 శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించారు. చదువు, ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. ప్రభుత్వం “బాల సంజీవని”, “బేటీ బచావో.. భేటీ పడావో”, “స్త్రీ శక్తి”, “తల్లికి వందనం” వంటి పథకాల ద్వారా మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నాయని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు 40 లక్షలకుపైగా మహిళలకు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. అలాగే పీఎంఈజీపీ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కలెక్టర్ వివరించారు.అంధ క్రికెటర్ కరుణ కుమారికి, అధికారులకు సత్కారం*ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన అంధ మహిళా క్రికెట్ క్రీడాకారిణి పి. కరుణ కుమారిని అతిథులంతా ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీసీసీ ఎండీ శోభికలకు సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు. ప్రత్యేక ఉప కలెక్టర్ శేషశైలజ, జిల్లా కోఆపరేటివ్ అధికారిణి ప్రవీణ, జూ క్యూరేటర్ మంగమ్మ, సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మి తదితర అధికారులతో పాటు ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన 59 మంది మహిళా అధికారులకు, సిబ్బందికి అవార్డులు అందజేసి సత్కరించారు.కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ. పిడి లక్ష్మీపతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత తదితరులు పాల్గొన్నారు.
*స్టాళ్ల సందర్శన... పథకాల ప్రయోజనాలు అందజేత*
ముందుగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, లతా మాధురి స్టాళ్లను సందర్శించి మహిళలు తయారు చేసిన వివిధ వస్తు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు లబ్ధిదారులకు ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన రూ.3 లక్షల విలువగల ఆటోలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు....................................
జారీ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్నం.





Comments
Post a Comment