మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ చింతా అనురాధ కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువు......
అల్లవరం, విశాఖ సందేసం...అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ లోని అక్కాచెల్లెమ్మలకు నిజమైన సాధికారత లభించేలా చిత్తశుద్ధితో వ్యవహరించాలని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఒక వెలుగు వెలిగిన సోదరీమణులు ఇప్పుడు చిన్నబోతున్నారని ఆమె పేర్కొంటూ, మహిళల కోసం ప్రధానంగా వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత, అమ్మఒడి, సున్నా వడ్డీ, వైయస్ఆర్ కాపు నేస్తం, వైయస్ఆర్ ఇబీసీ నేస్తం, విద్యా, వసతి దీవెన వంటి పథకాలే కాకుండా పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలతో లక్షలాది మంది మహిళలకు సొంత ఆస్తిని అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేసారు. కోట్లాది మంది అక్కచెల్లెమ్మలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా తమ ఖాతాల్లోకి సుమారు ₹1.89 లక్షల కోట్లు వేశారని కానీ నేటి కూటమి ప్రభుత్వం మాత్రం నిలువునా ముంచుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అనురాధ పేర్కొన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊదర కొట్టి బాబు ఇప్పటి వరకూ, 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా ఏడాదికి రూ.18 వేలు, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్, సున్నా వడ్డీతో మహిళా పొదుపు సంఘానికి రూ.10 లక్షల చొప్పున రుణాల ఊసు ఎత్తడం లేదని, అరకొర పథకాలు అమలు చేస్తూ ఎంతసేపు ప్రచార ఆర్భాటంతో గడుపుతున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. మరో పక్కన వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత సోదరుడిలా అండగా నిలబడి మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దిశా చట్టం, దిశా యాప్ మొదలైన వాటికి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని, అందుకే రాష్ట్రం మొత్తంలో మహిళలపై గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యాచారాలు, దాడులు పెరిగిపోయిన విషయాన్ని అనురాధ దుయ్యబట్టారు. మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అత్యవసర సేవలను కూడా నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, మహిళల సంక్షేమానికి మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని చింతా అనురాధ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments
Post a Comment