అల్లవరం, విశాఖ సందేశం..... అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడిందని డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్ వెల్లడించారు. అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. డి. ఎస్. పి ప్రసాద్ మాట్లాడుతూ అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులకు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించినట్లు ఆయన పేర్కొన్నారు.కేసు వివరాలు:*25 ఏప్రిల్ 2021న ఉప్పలగుప్తం మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి ఓడలరేవు బీచ్ సందర్శించి తిరిగి వెళ్తుండగా, అల్లవరం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బొమ్మిడి వీరాబాబు (27), కొప్పనాతి వెంకటేశ్వర్లు (26), మల్లాడి తాతారావు (28) అడ్డగించారు. బాధితురాలిని చంపుతామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా సెల్ ఫోన్ ద్వారా వీడియోలు, ఫోటోలు తీసి వేధించారు. బాధితురాలి ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు ఐపీసీ 376(D), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ కేసు విచారణ చేపట్టిన 10వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎస్. ఉమా సునందా, ప్రాసిక్యూషన్ సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో ముగ్గురు నిందితులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ. 5,80,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. సత్వర దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు ఎస్ఐ జి. ప్రభాకరరావు, సి.ఐ వీరాబాబు, సిబ్బందిని అభినందించారు. మహిళల రక్షణ విషయంలో జిల్లా పోలీసులు రాజీ పడబోరని డి ఎస్ పి ప్రసాద్ స్పష్టం చేశారు.


Comments
Post a Comment