కేంద్ర ఉక్కు మంత్రిని కలిసిన పల్లా* *▪️స్టీల్ ప్లాంట్ సమస్యలపై సమగ్ర చర్చలు… సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి*
ముఖ్యంగా ఉక్కునగరంలోని విమల విద్యాలయం మూసివేతపై పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, MoA కొనసాగింపులేక పాఠశాలను ఆకస్మికంగా నిలిపివేయడం వల్ల ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కూడా అనిశ్చితిలో పడిందని కేంద్ర మంత్రికి వివరించారు. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతను కాపాడడంతో పాటు బకాయి జీతాలను తక్షణం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదే విధంగా RINL కోసం భూములు సమర్పించిన స్థానికులైన R-కార్డు హోల్డర్ల సమస్యలను ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తూ, పరిపాలనా అడ్డంకుల కారణంగా వారికి ఉద్యోగావకాశాలు దూరమవుతున్న పరిస్థితిని వివరించారు. ఈ అన్యాయాన్ని వెంటనే సరిదిద్దుతూ, సంబంధిత పరిమితులను తొలగించి, స్థానికులకు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గాజువాక మండలం సనివాడ గ్రామం–స్టీల్ ప్లాంట్ మధ్య కొనసాగుతున్న భూవివాదంపై కూడా పల్లా గారు దృష్టి సారిస్తూ, సంయుక్త సర్వేలో గుర్తించిన భూములను పునరావాస అవసరాలకు వినియోగించి, ఆలయం, లైబ్రరీ వంటి సామూహిక సదుపాయాల ఏర్పాటుతో గ్రామస్తులకు న్యాయం చేయాలని సూచించారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి తెలియజేశారు.
పల్లా గారు ప్రతిపాదించిన ప్రతీ అంశంపై కేంద్ర ఉక్కు మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి గారు సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, “ప్రజల సమస్యలే మా అజెండా… పరిష్కారమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ప్రజా సమస్యలను కేంద్ర స్థాయికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారాలు సాధించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Comments
Post a Comment